పదేళ్ల పాలన అవినీతిమయం 

పదేళ్ల పాలన అవినీతిమయం 
  • పేదల బతుకుల్లో మార్పు కాంగ్రెస్ తోనే 
  • బీఆర్ఎస్ అంటే భూకబ్జాలు .. సెటిల్ మెంట్లు
  • మేడ్చల్ ​సభలో  రేవంత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని... ప్రజా పాలన కావాలో,  దొరల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మేడ్చల్ నియోజక వర్గంలోని జవహార్ నగర్, మేడ్చల్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో చేసిందేమీ లేదని, అందరి జీవితాలను చిన్నా భిన్నం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ను బొందలగడ్డ గా, తాగుబోతుల తెలంగాణ గా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఇస్తే ప్రజల జీవితాలు  బాగుపడుతాయని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సోనియా గాంధీ భావించారని, కానీ కేసీఆర్ పాలనలో అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. బీఆర్ఎస్ అంటేనే భూ కబ్జాలు, సెటిల్ మెంట్లేనని చెప్పుకొచ్చారు.లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.  అందువల్లే అన్నారం పగిలిందన్నారు.  అధికారంలో కి రాగానే అన్నీ కక్కిస్తామని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ అడుక్కు తినేవారు. తెలంగాణ ప్రజలు ఇంకా వారి మాయ మాటలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు  బై బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధమయ్యారు.పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కూలాల్సిందేనని పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ నియోజక వర్గంలో వంద పడుకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు జవహర్ నగర్ డంపింగ్ యార్డు కంపు నుండి విముక్తి కల్పించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. జవహార్ నగర్ డంపింగ్ యార్డు వల్లనే ఇక్కడి భూముల ధరలు పెరగడం లేదని ఈ సమస్యను పట్టించుకోకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఈ ప్రాంతంలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత కాలం భూకబ్జాలు, అవినీతి అక్రమాలకు కేరాఫ్ నిల్చిన మంత్రి మల్లారెడ్డిని ఈ ఎన్నికలలోప్రజలు బొంద పెట్టుడు ఖాయమని అన్నారు. మంత్రి గా ఉండి ఆయన కాలేజీలు, ఇతర కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నారు కానీ ఇక్కడి ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డ అయిన మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని రేవంత్ రెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అభ్యర్థి జంగయ్య యాదవ్,  నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.