ఎన్టీఆర్​ నాణేలపై బ్లాక్​దందా!

ఎన్టీఆర్​ నాణేలపై బ్లాక్​దందా!
  • వెంటనే అమ్ముడుపోయిన 12 వేల నాణేలు
  • డిమాండ్ ను బట్టి రూ.10 వేల వరకు అమ్మిన అక్రమార్కులు
  • కొత్త ప్రొడక్షన్ మొదలుపెట్టిన అధికారులు


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు ప్రజల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకంగా విడుదలైన రూ.100 నాణేలు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఈ నాణేల కోసం ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు  బ్లాక్ దందాకు తెరలేపారు. కేవలం రూ.5 వేలులోపు ధర ఉన్న ఈ నాణేలను డిమాండ్ ను బట్టి రూ.10 వేలు.. అంతకు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. నాణేలను దక్కించుకున్నవారిలో కొందరు అసలుధర కంటే ఎక్కువకు అమ్ముకుంటున్న ఘటనపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తొలివిడతగా 12 వేల నాణేలను విడుదల..

కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా 12 వేల నాణేలను విడుదల చేసింది. వాటిని మంగళవారం నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ కాంపౌండ్ కౌంటర్ల వద్ద విక్రయాలను ప్రారంభించారు. అయితే ఉదయం 10 గంటల నుంచే క్యూలైన్ భారీగా కనిపించింది. ఊహించని విధంగా వేలాదిమంది ఎన్టీఆర్ అభిమానులు నాణేల కోసం ఎగబడ్డారు. అయితే ఎన్టీఆర్ స్మారక నాణేల కోసం కనివినీ ఎరుగని రీతిలో డిమాండ్ ఉండటంతో కొత్త ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఆ నాణేలు తయారై బయటకు రావడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోపక్క నాణేల బ్లాక్ దందా ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరుస్తుంది. ఈ 100 రూపాయల నాణెం ధర చెక్కడబ్బా అయితే రూ.4,800 ఉంది. ప్రూఫ్ ఫోల్డర్ లో రూ.4,380 ఉంది. ఫోల్డర్ ప్యాక్ అయితే రూ.4,050గా ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింగ్, 5 శాతం నికెల్ మిశ్రమంతో ఈ నాణేన్ని తయారు చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఎన్టీఆర్ పేరుతో రిలీజైన నాణేన్ని అభిమానులు అపురూపంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాలలో  కనీసం లక్షకు పైగా నాణాలు పంపినా చాలవనే చెబుతున్నారు.