పంద్రాగస్టుకు  గోల్కొడ కోట ముస్తాబు

పంద్రాగస్టుకు  గోల్కొడ కోట ముస్తాబు
  • ఉదయం 11 గంటలకు జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
  • మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్​గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. గోల్కొండ కోటకు హాజరయ్యే ముందు కేసీఆర్ సికింద్రాబాద్ వెళ్లి అక్కడి పరేడ్‌ గ్రౌండ్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తారు. 

  • 12 వందల మందితో ప్రదర్శన..

పంద్రాగస్టు వేడుకలో భాగంగా గోల్కొండ కోట వద్ద  12 వందల మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. వేడుకల కోసం వచ్చే అతిథులు, ప్రజల కోసం అధికారులు ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు. కోటలో మొత్తం 14 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జలమండలి లక్ష వాటర్ ప్యాకెట్లు, 25వేల వాటర్‌ బాటిళ్లను అందుబాటులో ఉంచనుంది. 2 వేల వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. గోల్కొండ ప్రాంతంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అత్యవస పరిస్థితుల్లో  వైద్యసేవలు అందించేందుకు సభ ప్రాంగణంలో నాలుగు ఆంబులెన్స్ లు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఓ గదిని సిద్ధంగా ఉంచారు. 3 ఫైర్ ఇంజన్లు, 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లను అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేకంగా జనరేటర్లను అందుబాటులో ఉంచారు. వర్షం పడినా ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫ్రూప్ షెడ్లను ఏర్పాటు చేశారు. 

  • 120 సీసీ కెమెరాలను ఏర్పాటు..

వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోటలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కోటలో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు కాకుండా అదనంగా 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించారు. కోట చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవున ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్బీ, సీఏఆర్ తదితర బృందాలు రెండు వారాలుగా భద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. 

  • వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు..

మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోట వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.  గోల్కొండ కోటకు వచ్చే వాహనాలకు పోలీసులు గోల్డ్‌, పింక్‌, బ్లూ, గ్రీన్‌ కలర్‌లో ఉండే నాలుగు రకాల పాస్​లు జారీ చేశారు. అన్ని రకాల పాస్‌ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాల్సివుంది. అలాగే  గోల్కొండ కోటకు వచ్చే వీఐపీ, సామాన్యులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,930 వాహనాల పార్కింగ్ చేసే విధంగా మంత్రులు, వీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, మీడియా వాహనాలు, సందర్శకులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.