త్వరలో నిరుద్యోగ భృతి

 త్వరలో నిరుద్యోగ భృతి

పొలిటికల్‌ స్కెచ్‌ వేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిట్ట. ఆయన ప్లాన్‌ చేస్తే పక్కాగా ఉంటుందని, ఆయన మనసులో ఏముందో ఆయన నీడ కూడా పసిగట్ట లేదనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఉంది. అలాంటి కేసీఆర్‌ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అనూహ్యంగా ఆలోచనలో పడిపోయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఇచ్చిన హావిూలు నెరవేర్చకపోవడం, అప్పులు తీసుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు గడవని పరిస్థితిలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నిర్ణయాలు కేసీఆర్‌కు ఏడారిలో ఓయసిస్సులా మారిందనే చర్చ జరుగుతోంది.ఎన్నికల హావిూల విషయంలో సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇచ్చిన ఏ హావిూ సంపూర్ణంగా నెరవేర్చలేదనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. మొదటి దఫా అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి హావిూలు అటకెక్కాయని ప్రతిపక్షాలు టార్గెట్‌ చేస్తున్నాయి. ఇక రెండోసారి అధికారం కోసం నిరుద్యోగ భృతి, ఖాళీ స్థలాలున్న వారి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం వంటి హావిూలు ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ముందు తీసుకువచ్చిన దళిత బంధు అమలు ప్రభుత్వానికి ఓ సవాలుగా మారింది. దీంతో కేసీఆర్‌ హావిూలు అన్ని మాటలకే పరిమితం అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఛత్తీస్‌ గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రిపబ్లిక్‌ డే సందర్భంగా తీసుకున్న నిర్ణయం కేసీఆర్‌కు కలిసి వచ్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఛత్తీస్‌ గఢ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌ ఇచ్చినట్టుగానే గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని హావిూ ఇచ్చింది. కానీ ఇన్నాళ్లు ఆ విషయాన్ని పట్టించుకోని భూపేష్‌ సర్కార్‌ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయన్న తరుణంలో అనూహ్యంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం వెల్లడిరచారు. నెలకు ఎంత మొత్తం ఇస్తామనేది చెప్పకుండానే తాము ఇచ్చిన హావిూని నెరవేర్చబోతున్నామని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఛత్తీస్‌ గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పుడు కేసీఆర్‌ ఫాలో అవ్వబోతున్నారా అనేది చర్చగా మారింది. ఈ ఏడాది కేసీఆర్‌కు అగ్నిపరీక్షగా మారింది.ఓ వైపు బీజేపీ మరో వైపు కాంగ్రెస్‌ వీటికి తోడు మరికొన్ని పార్టీలు బరిలోకి దిగబోతుండటంతో ఎన్నికలు గతంలో మాదిరిగా నల్లేరువిూద నడకేం కాదనే విషయం కేసీఆర్‌కు తెలిసిపోయింది. దీంతో ఈ ఏడాది నిరుద్యోగ భృతితో పాటు మరికొన్ని తాయిలాల ప్రకటనతో పాటు ఇన్నాళ్లు పెండిరగ్‌లో ఉన్న హావిూలన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సంవత్సరంలో హావిూ నెరవేరుస్తున్నాడని తనపై విమర్శలు వస్తే ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని చూపించి కాంగ్రెస్‌ను, మోడీ చెప్పిన లక్ష ఉద్యోగాల హావిూని చెప్పి బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహంలో కేసీఆర్‌ ఉన్నట్టు టాక్‌ వినిపిస్తోంది. మరి నిజంగానే తెలంగాణలో ఈ ఏడాది నిరుద్యోగ భృతి అమలు చేస్తారా అనేది బడ్జెట్‌ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.