బీజేపీకి ‘బండి’ ఎఫెక్ట్!

బీజేపీకి ‘బండి’ ఎఫెక్ట్!
  • స్టేట్​చీఫ్​గా సంజయ్​ను తప్పించడంతో నేతల నిరాశ
  • పార్టీ మారుతున్న కొందరు లీడర్లు
  • డైలమాలో మరికొంతమంది 
  • కిషన్​రెడ్డి సామర్థ్యంపై నేతల మౌనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్​చీఫ్​గా బండి సంజయ్​ను తప్పించడంతో రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని భావించిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​నుంచి పార్టీలోకి వలసలు వచ్చాయి. కానీ ఇటీవల బండి సంజయ్​ను రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించడంతో వలస వచ్చిన నేతలంతా కంగుతిన్నారు. 

  • నేతల్లో అసంతృప్తి..

బండిని హైకమాండ్​మార్చడంతో రాష్ట్ర నేతల్లో కొంత అసంతృప్తి నెలకొంది. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్​రెడ్డితో ఇబ్బందులు లేకున్నప్పటికీ ఆయన పార్టీని నడపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించిన వాళ్లు లేకపోలేరు. గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్​బ్యాచ్​లు ఉన్నప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉండడంతో ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించే సామర్థ్యం కిషన్​రెడ్డిలో లేదని కొందరు నేతలు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడారు. బండి సంజయ్​ను మార్చడంతో తాను నిరాశ చెందానని చంద్రశేఖర్​అన్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్​కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి సీఎం కేసీఆర్​తో బీజేపీ లోపాయికారి ఒప్పందం జరిగిందని తెలిపారు. దీంతో కేసీఆర్​ ప్రభుత్వంపై పోరాటం లేదని తేల్చిచెప్పారు. చంద్రశేఖర్​ లాగానే మరికొంత మంది నేతలున్నట్లు సమాచారం. బండి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో పార్టీ బాగా అభివృద్ధి చెందిందని, ఇపుడు మళ్లీ ఆ స్థాయిలో డెవలప్​మెంట్​ఉంటుందా? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

  • అనుమానం రేకెత్తిస్తున్న విజయశాంతి ట్వీట్లు..

మాజీ ఎంపీ విజయశాంతి కూడా బండి సంజయ్​ను మార్చడంతో డీలా పడినట్లు తెలిసింది. ఆమె చేసిన ట్విట్టర్లు చాలా మందిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. విజయశాంతి అశాంతిగా కనిపిస్తున్నారని, ఆమె మనసులో మరో ఆలోచన ఉందా? అన్న ప్రశ్నలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదేవిధంగా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రావడంపై తన అసంతృప్తిని బహిరంగంగానే విజయశాంతి వ్యక్తం చేశారు. దాని మీద సీరియస్‌గానే ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వారితో వేదిక పంచుకోవడం ఇష్టంలేకే తాను ఆ కార్యక్రమం మధ్యలో వచ్చేశానని చెప్పారు. అప్పట్లో దీని మీద బాగానే రచ్చ అయింది. విజయశాంతి పార్టీలో ఉంటారా? అని జరిగిన ప్రచారంపై కూడా స్పందిస్తూ ట్వీట్స్ చేసి వెంటనే డిలీట్‌ చేశారు. ఇక తాజాగా మణిపూర్ ఘటనలపై కూడా సీరియస్‌గా రాములమ్మ రియాక్ట్ అయ్యారు. దోషుల్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఓవైపు బీజేపీ అగ్రనాయకత్వం రాజస్థాన్, బెంగాల్‌లో మహిళల మీద జరుగుతున్న దాష్టికాల సంగతేంటని ప్రశ్నిస్తున్న టైంలో విజయశాంతి ఒక్క మణిపూర్‌ గురించే ప్రశ్నించడం వెనక వ్యూహం ఏదన్నా ఉందా? అనే చర్చ పార్టీలో మొదలైంది. ఆ విషయాన్ని గ్రహించిన విజయశాంతి తర్వాత ఆ రెండు రాష్ట్రాలను కూడా కలుపుతూ మరోసారి ట్వీట్ చేశారు.

  • కిందిస్థాయి కేడర్​లో నిరాశ..

కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టే ఎన్నో సమస్యలు ఉన్నా.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని లేవనెత్తడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోవడం.. ఇచ్చినా తక్కువ సమయం కేటాయిస్తున్నారని సదరు నేతలు చెబుతున్నారు. దీంతో కిందిస్థాయి నేతల్లో నిరాశ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా పార్టీ స్తబ్దుగా మారింది.