100 సీట్లు కాంగ్రెస్​వే!

100 సీట్లు కాంగ్రెస్​వే!
  • త్వరలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం
  • కొల్లాపూర్​లో ‘బీరం’ను గెలిపిస్తే దొరగారి దొడ్లో చేరారు
  • టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి 
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు చెందిన మహశ్వరం, ఉమ్మడి పాలమూరు నాయకులు, కార్యకర్తలు ఆదివారం జూబ్లీహీల్స్ లోని రేవంత్​ఇంట్లో కాంగ్రెస్​పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రేవంత్​మాట్లాడారు. త్వరలోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పాలమూరులో ఏ ప్రాజెక్టు నిర్మించినా బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లాపూర్​ప్రజల భూములనే గుంజుకుందని ఆరోపించారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే భూ నిర్వాసితులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఎమ్మెల్యే మాత్రం దొరగారి దొడ్డిలో చేరారంటూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలంతా జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పుడు రైతులు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టొద్దన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు.