ప్రగతి భవన్ లో రాజీలు

ప్రగతి భవన్ లో రాజీలు
  • ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించాల్సిందే
  • సరికొత్త చరిత్రను సృష్టించాల్సిందే
  • నేతలకు దిశా నిర్దేశం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • పార్టీ అభ్యర్దుల విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హుకుం
  • అంకితభావంతో పనిచేసిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం
ముద్ర, తెలంగాణ బ్యూరో : అసంతృప్తి, అసమ్మతి రాగాలను వినిపిస్తున్న నేతలను తమ దారికి తెచ్చుకునే ప్రయత్వాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మరింత ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన విదేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్నప్పటి నుంచి మొదలుకుని నేటి వరకు  ఇదే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒకవైపు పార్టీ అభ్యర్ధుల పక్షాన ముమ్మరంగా ప్రచారం చేస్తూనే....మరోవైపు ప్రగతి భవన్ లో నేతల మధ్య రాజీ కుదుర్చుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో నిప్పు...ఉప్పు ఉన్న నేతలంతా ఒకేమాట...ఒకే బాట అంటూన్నారు. పార్టీ అధిష్టాం తీసుకున్న నిర్ణయమే శిరోధార్యమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తామని అధిష్టాన వర్గానికి హామీలను కూడా ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే మంగళవారం  కూడా జనగామ, నల్గొండ జిల్లాలతో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన హితబోధ చేశారు. ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించాల్సిందే సరికొత్త చరిత్రను సృష్టించాల్సిందేనని అన్నారు. ఇందుకోసం నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మన పార్టీ అధికారంలో ఉంటే  ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. అదే తప్పుడు హామీలతో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అదే సమయంలో  మనంలో మనం కీచులాటలకు దిగితే ప్రత్యర్ధులు బలపడే అవకాశముందన్నారు. అందువల్ల  మరోసారి మనం అధికారంలోకి వస్తేనే....అందరికి రాజకీయ భవిష్యత్ మరింత ఉన్నతంగా ఉంటుందన్నారు. అలాంటి వారికే భవిష్యత్తులో తగు ప్రాధాన్యతను ఇస్తామని మంత్రి కేటీఆర్ ఖరాఖండిగా చెప్పారని తెలిసింది. కాగా తదనంతరం మంత్రుల నివాసంలో గల క్లబ్ హౌజ్ లో  జనగామ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డా. టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో  పార్టీని జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.