పల్లా, పోచంపల్లి.. మా వైపు కన్నెత్తి చూడకండి

పల్లా, పోచంపల్లి.. మా వైపు కన్నెత్తి చూడకండి
  • పరాయి పాలన మాకొద్దు
  • స్థానిక నేతనైన నా కోసమే జనగామ టికెట్‌ ఆపారు
  • ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు
  • టికెట్‌ కోసం కేసీఆర్‌‌ సాష్టాంగ నమస్కారం చేసిన వేడుకోలు

ముద్ర ప్రతినిధి, జనగామ:  జనగామ నియోజకవర్గం పదేళ్లుగా విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని, పరాయి లీడర్ల పాలనలో ఇక్కడ ప్రజలు నలిగి పోతున్నారని ఆప్కో మాజీ చైర్మన్‌, టీఆర్‌‌ఎస్‌ నేత మండల శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ టికెట్‌ బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాములు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్‌ఎంఆర్‌‌ గార్డెన్‌లో నిర్వహించన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగామకు సంబంధం లేని లీడర్లు ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీలుగా అటు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎంతో గౌరవం ఉందని, దానిని వారు అలాగే కాపాడుకోవాలన్నారు. ఓ బహుజన బిడ్డగా తకు జనగామ నుంచి పోటీ చేసేందుకు వచ్చే అవకాశాన్ని అడ్డుకోవద్దని కోరారు. జనగామకు ఎలాంటి సంబంధం లేని పల్లా, పోచంపల్లి ఈవైపు కన్నెతి చూడొద్దన్నారు.

 వారు రాజకీయాలు చేయాలనుకుంటే వారి సొంత నియోజకవర్గాల్లో చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌‌ ముచ్చటగా మూడో సారి సీఎం కావాలంటే ప్రతి సీటు ముఖ్యమేనని, అందుకే జనగామలో పార్టీ ఓడిపోవద్దని వ్యూహాత్మకంగా పెండింగ్‌లో పెట్టారని శ్రీరాములు చెప్పారు. బీసీ నేత పార్టీ నమ్ముకుని సేవ చేస్తున్న తనకే టికెట్‌ ఇవ్వాలని మండల సీఎం కేసీఆర్‌‌ చిత్ర పటానికి సాష్టాంగ నమస్కారం చేశారు. సమావేశంలో బీసీ లీడర్లు సంఘం దోర్నాల వెంకన్న, వజ్జ పర్శరాములు, మచ్చ బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, సభలో ఎస్‌.కే రాజు కళా బృందం వారి ఆటాపాటలతో శ్రీరాములు సేవలను వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.