ధూపదీప నైవేద్యానికి రూ.10 వేలు

ధూపదీప నైవేద్యానికి రూ.10 వేలు
  • రూ.6వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు
  • అర్చకుల గౌరవ వేతనం రూ.6 వేలకు పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ


ముద్ర, తెలంగాణ బ్యూరో : ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. దీనికింద నెలకు ఇచ్చే మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఆలయ అర్చకుల గౌరవ వేతనం రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో మంగళవారం దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

మ‌రో 2,796 దేవాల‌యాల‌కు ప‌థ‌కాన్ని వర్తింపు..

ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 ఆలయాలకు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో మ‌రో 2,796 దేవాల‌యాల‌కు ఈ ప‌థ‌కాన్ని విస్తరింప‌జేస్తామని ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 6,441 ఆలయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వహ‌ణ వ్యయం అందనుంది. గతంలో భక్తులు ఇచ్చే కానుకలతో ఆలయాల్లో నిత్యపూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు. దీంతో పూజారులకు ఆలయాల నిర్వహణ, కుటుంబ పోషణ కష్టంగా మారింది. ధూపదీప నైవేద్య పథకం ప్రారంభమై అర్చకులకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ.2,500 వేతనంగా నిర్ణయించింది. కానీ ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని ప్రభుత్వం గుర్తించింది. దీంతో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 2015 జూన్‌ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలయాలకు.. అర్చకులకు మరింత మేలు చేకూరనుంది.