నో అపాయింట్​మెంట్!

నో అపాయింట్​మెంట్!
  • కాంగ్రెస్ బీసీ నేతలకు టైమివ్వని ఏఐసీసీ
  • ఢిల్లీలో 40 మందికి పైగా మకాం 
  • మీటింగ్​కోసం మూడు రోజులుగా ఎదురుచూపులు
  • మధుయాష్కీ నివాసంలో బీసీ నేతల కీలక భేటీ
  • భవిష్యత్​కార్యాచరణపై సమాలోచనలు
  • రేవంత్​తో వెళ్లిన బీసీయేతర నేతలతో రాహుల్ భేటీ!


ముద్ర, తెలంగాణ బ్యూరో : బీసీలకు 34 టిక్కెట్ల డిమాండ్  తో ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్  బీసీ నేతలకు ఏఐసీసీ ఝలక్​ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లలో బీసీల వాటాను తేల్చుకునేందుకు సుమారు 40 మంది బీసీ లీడర్లు మూడు రోజుల క్రితమే హస్తినకు చేరుకున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో మాట్లాడి.. టిక్కెట్లు ఖరారు చేసుకురావాలనే నిర్ణయంతో అక్కడే మకాం వేశారు. ఈ క్రమంలో పలుసార్లు అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పటి వరకు అక్కడే వేచి చూస్తున్న బీసీ నేతలు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. 

మండిపడుతున్న సీనియర్లు..

ఈ మేరకు గురువారం రాత్రి ఢిల్లీలోని నిజామాబాద్​ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​ నివాసంలో భేటీ అయ్యారు. బీసీలకు ఇవ్వాల్సిన టిక్కెట్ల వ్యవహారంలో టీపీసీసీ, ఏఐసీసీ అగ్రనేతల నాన్చుడు ధోరణిపై మండిపడ్డ పలువురు సీనియర్లు నేడు కూడా అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ శుక్రవారం కూడా ఏఐసీసీ అగ్రనేతలు స్పందించకపోతే నేరుగా హైదరాబాద్ కు వచ్చి భవిష్యత్​కార్యాచరణ రూపొందించే యోచనతో ఉన్నట్లు సమాచారం. 

రేవంత్ కు టైమిచ్చిన రాహుల్..

బీసీ నేతలకు టైమివ్వని ఏఐసీసీ నేతలు.. గురువారం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మేడ్చల్ -మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కు నేరుగా రాహుల్​ గాంధీ సమయం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ లో చేరేందుకు.. రేవంత్​ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రోహిత్, నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమయం ఇవ్వడాన్ని బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏళ్ల నుంచి పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేసిన తమకు సమయం ఇవ్వని ఏఐసీసీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి చెక్​ పెట్టేలా.. శాసనసభలో బీసీ ప్రాతినిధ్యం పెరిగేలా తమ వర్గ నేతలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తుంటే.. తమ ప్రయత్నాలను అగ్రవర్గాలు అడ్డుకుంటున్నాయనే తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. తమ డిమాండ్లపై ఏఐసీసీ సానుకూలంగా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలో రాదని, బీసీ ఓట్లు అత్యధికంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అగ్రవర్గాల అభ్యర్థులను ఓటర్లు బహిష్కరిస్తారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్​ వంటి సీనియర్లు ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి ఆల్టీమేటం జారీ చేశారు. 

స్టాటజీ సమావేశంలో బీసీ వాణి..

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దాదాపు నెల రోజుల నుండి మీడియా మీట్లు నిర్వహిస్తున్న బీసీ నేతలు రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్​ స్టాటజీ సమావేశంలోనూ తమ వాణిని బలంగా వినిపించారు. ఇటు తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి  మాణిక్​ రావ్​ ఠాక్రేకూ విన్నించారు. ఇటు టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిని సైతం కలిసి తమ డిమాండ్​ను అధిష్టానం ముందుంచాలని వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఏఐసీసీ నుంచి స్పందన రాకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలావుంటే.. గురువారం రాత్రి 9గంటలకు మైనంపల్లి, వీరేశం, అనిల్ కుమార్ లు కాంగ్రెస్​ లో చేరికల తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీసీ నేతలతో సమావేశం అవుతారంటూ ప్రచారం జరిగింది.