బై బై గణేశా!

బై బై గణేశా!
  • నగరంలో ప్రశాంతంగా వినాయకుల నిమజ్జనం
  • ట్యాంక్ బండ్​వద్ద కనులపండువగా ఘట్టం 
  • క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్.. 13 దగ్గర బాలాపూర్ గణేశుడి నిమజ్జనం
  • మరో వంద ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాట్లు
  • వేలం పాటలో రికార్డులు బ్రేక్ చేసిన లడ్డూలు
  • కొనసాగుతోన్న నిమజ్జనాలు.. పోలీసులతో భారీ భద్రత
  • ఏర్పాట్లపై మంత్రుల ఏరియల్ సర్వే

భాగ్యనగరం గణనాథులమయమైంది. కాషాయ పగిడీలు, టోపీలు, కండువాలు ధరించి లక్షల మంది భక్తుల నడుమ వినాయకుల ఊరేగింపు శోభయమానంగా సాగింది. అశేషంగా వచ్చిన భక్తులు బై బై గణేశా..! అంటూ గణపయ్యకు వీడ్కోలు పలికారు. నగరంలో నవరాత్రులు పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాల నిమజ్జన వేడుకలు గురువారం ఉదయం ప్రారంభం కాగా శుక్రవారం ఉదయం వరకు కొనసాగుతాయని భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్​నుంచి బయలుదేరిన 63 అడుగుల ఎత్తైన గణేశ్​విగ్రహాన్ని.. ట్యాంక్​ బండ్​పై ఏర్పాటు చేసిన 4వ క్రేన్​వద్ద మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నిమజ్జనం చేశారు. కాగా ప్రసిద్ధ బాలాపూర్​గణేశుడి నిమజ్జం 13వ నంబర్​క్రేన్​ వద్ద సాయంత్రం 6గంటల ప్రాంతంలో ముగిసింది. 


లడ్డూల వేలంలో రికార్డులు బ్రేక్

9 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణపతుల లడ్డూలకు వేలంపాటలో రాకార్డు స్థాయి ధర పలికింది. హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్.. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లోని వినాయకుడి చేతిలోని లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఈ లడ్డూను సొంతం చేసుకుంది. అలాగే బాలాపూర్​ లడ్డూ వేలంలో రికార్డు బ్రేక్ అయింది. లడ్డూ ధర ఏకంగా రూ.27లక్షలు పలికింది. గణేశ్​ఉత్సవ సమితి గురువారం నిర్వహించిన వేలం పాటలో 36 మంది పాల్గొనగా.. దాసరి దయానంద్ రెడ్డి రూ.27లక్షలతో లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకోగా.. ఈ సారి రూ.2 లక్షల కంటే 40 వేల అదనంగా లడ్డూ ధర పలికింది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలి వేలం పాటలో కేవలం రూ.450 పలికిన లడ్డూ ధర.. 1995లో ఏకంగా రూ.4,500 పలికింది. తర్వాత ఏటా వేలం పాటలో లడ్డూ ధర రికార్డులు బ్రేక్​ చేస్తూనే వస్తోంది.

ముద్ర, తెలంగాణ బ్యూరో : నవ రాత్రులు పూజలందుకున్న పార్వతీ తనయుడు గురువారం ఉదయం గంగమ్మ ఒడికి చేరాడు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, రాంపూర్, సఫిల్ గూడ, కాప్రాసహా హైదరాబాద్​శివారులోని 100 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బడా గణేశుల నిమజ్జన పర్వం ముగియడంతో నగరంలోని సుమారు లక్షకుపైగా గణేశ్​విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. వీటిలో ప్రధానంగా హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనమవుతున్నాయి. గురువారం రాత్రి 8గంటల వరకు ట్యాంక్​ బండ్​పై 40 వేలకు పైగా విగ్రహాలు గంగమ్మ ఒడిలో సేదతీరాయి. 

హుస్సేన్​సాగర్​చుట్టూ 32 భారీ క్రేన్లు..

వినాయక నిమజ్జనాలకు హుస్సేన్​సాగర్​ చుట్టూ 32 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. విగ్రహాల ఊరేగింపులో ఇబ్బందులు కలగకుండా.. నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. రేపు రాత్రి వరకు నగరంలో లారీలకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంపులు, డీఆర్డీఎఫ్​ సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రత్యేక బోట్ లో సాగర జలాల్లో ప్రయాణిస్తూ అధికారులకు సూచనలు చేశారు. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిబ్బంది, నగర సీపీ ఆనంద్, డీఆర్ఎఫ్ చీఫ్ ప్రకాశ్​రెడ్డి, విద్యుత్, తాగునీరు, పర్యాటక శాఖ, ఖైరతాబాద్ గణేశ్​కమిటీ, అధికారులు, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అలాగే హైద్రాబాద్ నగరంలో గణేశ్​విగ్రహాల శోభాయాత్ర జరుగుతున్న తీరును పరిశీలించిన భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి సభ్యులు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న ఊరేగింపు!

బొజ్జ గణపయ్య నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బోలో గణేశ్​మహరాజ్ కి జై అంటూ భక్తుల జయజయధ్వానాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల మద్య గణేశుడి విగ్రహాలు ముందుకు సాగాయి. శోభాయాత్రలో మహిళల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయం ఉట్టిపడే వేషధారణలో మహిళలు లంబోదరుడి శోభాయాత్రకు తరలివచ్చారు.

పోలీసుల హై సెక్యూరిటీ..

ఓవైపు గణేశ్​ నిమజ్జనం.. మరోవైపు మిలాద్– ఉన్– నబీ రెండు ఉత్సవాలు ఒకే రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సాధారణ పోలీసులు, ఏఆర్, రిజర్వ్​పోలీసులతో పాటు కేంద్ర బలగాలను 40వేల మందిని రంగంలో దింపింది. మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసు ఆంక్షలు విధించారు. మరోవైపు గణేశ్​ విగ్రహాల కదలికలు, నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్ నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. అలాగే కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జన తీరును రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీకుమార్ తో కలిసి ఏరియల్​సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, రాంపూర్, సఫిల్ గూడ, కాప్రాలో జరుగుతోన్న నిమజ్జన ప్రక్రియను వీక్షించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లి సమీక్ష నిర్వహించారు.