రాష్ట్రానికి మరో రెండు పరిశ్రమలు

రాష్ట్రానికి మరో రెండు పరిశ్రమలు
  • సింటెక్స్, కిటెక్స్ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్​
  • 12 వేల మందికి ఉపాధి
  • డిసెంబర్ నాటికి అందుబాటులోకి!

ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండు దిగ్గజ కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ 2 పరిశ్రమల యూనిట్​పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో కిటెక్స్ కంపెనీ రూ.1,200 కోట్లతో సీతారాంపూర్ లో తన ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ తయారీ క్లస్టర్ కోసం ఆ సంస్థ చైర్మన్ సాబు జాకబ్ తో కలిసి పనులు ప్రారంభించారు. ఈ క్లస్టర్ ఏర్పాటు తర్వాత రోజూ 7 లక్షల దుస్తులను కిటెక్స్ సంస్థ ఉత్పత్తి చేయనున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కిటెక్స్ సంస్థ తెలిపింది. కిటెక్స్ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్ట్స్​టైల్ పార్కులో తన భారీ తయారి యూనిట్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వరంగల్ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు కిటెక్స్ సంస్థ ఈ సందర్భంగా  తెలిపింది. ఈ యూనిట్ ద్వారా 12వేల మందికి ఉపాధి కల్పించనుండగా ఇందులో 80 శాతం వరకు మహిళలకే ప్రాధాన్యత కల్పిచనున్నమన్నారు. రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కిటెక్స్ సంస్థకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కిటెక్స్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని పేర్కొన్నారు. కిటెక్స్ సంస్థ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. 

రూ.350 కోట్లతో సింటెక్స్ యూనిట్..

వెల్స్పాన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ రూ.272 కోట్ల పెట్టుబడితో చందనవెల్లిలో మూడో యూనిట్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇప్పటికే చందనవెల్లిలో 2 యూనిట్లను నడుపుతున్నది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ తో 650 మందికి ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సింటెక్స్ యూనిట్ ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి అయ్యేలా యజమాన్యం చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.