ప్రపంచ ఐక్యతకు  భారత్‌ విశేష కృషి

ప్రపంచ ఐక్యతకు  భారత్‌ విశేష కృషి
  • జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమయింది
  • కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో  : ప్రపంచ ఐక్యత, సహకారాన్ని పెంపొందించడంలో భారత్‌ విశేష కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం.. దేశ నాయకత్వానికి నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. భారతదేశం వేదికగా నిర్వహించిన జీ-20 సదస్సు.. 21వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంగా జి కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఈ మేరకు కిషన్‌ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్, 2022లో భారతదేశం  జీ 20 ప్రెసిడెన్సీని స్వీకరించినప్పటి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. మొత్తం ప్రపంచం ‘వసుధైవ కుటుంబం’ అనే సందేశానికి కట్టుబడి ఉండేలా మోడీ చూసుకున్నారంటూ ప్రశంసించారు.  జీ 20 ఈవెంట్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 115 కంటే ఎక్కువ దేశాల నుంచి 25,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులతో 60 నగరాల్లో దాదాపు 225 సమావేశాలు జరిగాయన్నారు. జన్ భగీదారి స్ఫూర్తి ప్రబలంగా ఉందని.. దీని ఫలితంగా చారిత్రాత్మక ‘జి20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటన’ వచ్చిందన్నారు. ఫలితంగా, భారత్‌ లో  జీ 20 , 21వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంగా నిలిచిపోతుందన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో   జీ 20 శిఖరాగ్ర సమావేశాలు.. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో జరుగుతాయని.. ఆ దేశాల్లో జీ 20 ఎజెండాను కొనసాగించడానికి న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌ను ఉపయోగిస్తాయన్నారు.  ఢిల్లీలో జరిగిన  జీ 20  లీడర్స్ సమ్మిట్ ప్రపంచ ఐక్యత, సహకారాన్ని పెంపొందించడంలో భారతదేశ నాయకత్వానికి నిదర్శనమని కిషన్‌ రెడ్డి పేర్కొ్న్నారు.  జీ 20 లో కొత్త శాశ్వత సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్‌ని ప్రవేశపెట్టడం వలన  జీ  20 వంటి అత్యంత ప్రభావవంతమైన ఫోరమ్‌లో గ్లోబల్ సౌత్ స్వరానికి ప్రాతినిధ్యం వహించేలా భారతదేశం నిబద్ధతను నిర్ధారిస్తుందన్నారు.

జీ  20 సమ్మిట్ సందర్భంగా ప్రకటించిన సమగ్ర రైలు, షిప్పింగ్ కనెక్టివిటీ నెట్‌వర్క్    అమెరికా , భారతదేశం, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ దేశాలు, యూరోపియన్ యూనియన్‌లను కలుపుతుంది.. ఇది ఆతిథ్య దేశాల భాగస్వామ్యానికి చిహ్నమని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను చైనా, రష్యాలు అంగీకరించాయని.. సాధ్యం కాని చోట కూడా ఏకాభిప్రాయాన్ని గుర్తించాయన్నారు. ఇది ప్రపంచ నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమైందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో గత 9 సంవత్సరాలుగా అతను ఏర్పరచుకున్న సంబంధాల కారణంగా ఇది జరగిందన్నారు.   ఢిల్లీలో జరిగిన  జీ  20  లీడర్స్ సమ్మిట్ సందర్భంగా సాధించిన ఒక ముఖ్యమైన మైలురాయి, స్థిరమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధితోపాటు.. పర్యాటకం, సంస్కృతి కీలక పాత్రను ఏకగ్రీవంగా ఆమోదించడం మంచి పరిణామం అని కిషన్‌ రెడ్డి పేర్కొంటున్నారు.