‘హస్త’వ్యస్తం!

‘హస్త’వ్యస్తం!
  • బీఆర్ఎస్​లోకి ఉత్తమ్, పొన్నం, దామోదర?
  • కారెక్కేందుకు అనుచరులతో రహస్య సమాలోచనలు
  • కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా నేతలు
  • లీడర్ల మధ్య అసంతృప్తి, వర్గ విభేదాలే కారణమా?

ముద్ర, తెలంగాణ బ్యూరో : నేతల మధ్య పెరుగుతోన్న వర్గ విభేదాలు.. అసంతృప్తి కాంగ్రెస్ లో శ్రేణుల్లో కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తామంటూ మీడియా ముందుకొచ్చి చెబుతోన్న సీనియర్ల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తమ రాజకీయ భవితవ్యంపై తమ అనుచరులతో తెరచాటు సమాలోచనలు చేస్తున్న పలువురు సీనియర్లు.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

  • రేవంత్​రెడ్డిపై ఏఐసీసీకి ఉత్తమ్​ఫిర్యాదు

ప్రస్తుతం కాంగ్రెస్​సీనియర్​ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ్మ త్వరలో బీఆర్ఎస్​లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల టీపీసీసీ రూపొందించిన కాంగ్రెస్‌ ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ కుమార్​రెడ్డి దంపతుల పేర్లు లేవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన నియోజకవర్గమైన హుజూర్​నగర్​లో తనను కాదని ఆయన అనుచరుడిపై సర్వే చేయించారంటూ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇదివరకే టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిపై ఏఐసీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడే ఉత్తమ్​దంపతులు బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారానికి తెరమీదకు వచ్చింది. రేవంత్​రెడ్డి కావాలనే తనపై, తన సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఇప్పటికే పలు సందర్భాల్లో ఆరోపించిన ఉత్తమ్​కుమార్​రెడ్డి.. కొంతకాలంగా తన సొంత నియోజకవర్గం హుజూర్​నగర్ లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

  • ఉత్తమ్​సతీమణికి కోదాడ టిక్కెట్ పై సీఎం హామీ..?

తాజాగా ఉత్తమ్ కుమార్​రెడ్డి ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు యాదాద్రి భువనగిరి డీసీసీ తాజా మాజీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గులాబీ గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన పార్టీ వీడడానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణం అని అనిల్ కుమార్‌రెడ్డి చెప్పడం ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ ప్రధాన అనుచరుడు పార్టీని వీడటం, కాంగ్రెస్‌ ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ దంపతుల పేర్లు లేకపోడంతో వారు బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్​కుమార్​రెడ్డికి ఏదో ఓ స్థానం నుంచి ఎంపీగా, ఆయన సతీమణి పద్మావతికి కోదాడ ఎమ్మెల్యే టిక్కెట్టు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

  • తీవ్ర అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తనకు ఇటీవల ప్రకటించిన ఎన్నికల ప్రచార, నిర్వహణ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై కరీంనగర్​మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీపరంగా ఏ సమస్య ఉన్నా కలిసి పరిష్కరించుకోవాలని, గాంధీభవన్ కు వచ్చి ఆందోళన చేస్తే పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తానని రేవంత్​రెడ్డి ఇటీవల హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా పొన్నం అనుచరులు ఈనెల 23న గాంధీభవన్​వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పొన్నం అనుచరుల తీరుపై రేవంత్ మండిపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భవిష్యత్​లో పార్టీలో పదవులు వరిస్తాయో లేవో అనే భావనతో ఉన్న పొన్నం ప్రభాకర్​ను ఆయన అనుచరులు బీఆర్ఎస్​లో చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నం కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. 

  • పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజనర్సింహ..

మరో సీనియర్​నేత మాజీ మంత్రి దామోదర రాజనర్సింహా సైతం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్​కు రావడం సైతం తగ్గించేశారు. ఓ వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కంటే సీనియర్ అయిన తనకు పార్టీలో ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్​ఎన్నికల నిర్వహణ కమిటీలో చోటు దక్కింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్​ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోన్న సీనియర్లకు బీఆర్ఎస్​ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో ఉంటారోననే చర్చ ఇప్పట్నుంచే ఉత్కంఠ రేపుతోంది.