బీఆర్ఎస్ కు షాక్!

బీఆర్ఎస్ కు షాక్!
  • కోర్టు వివాదాలలో కలవరం
  • వరుసగా వెలువడుతున్న తీర్పులు
  • వివాదాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు
  • వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు
  • శ్రీనివాస్​గౌడ్ కేసులో​ఈ వారంలోనే తీర్పు?
  • ‘సుప్రీం’లో ఎంపీ పాటిల్ కు చుక్కెదురు 
  • మంత్రి కొప్పుల పిటిషన్ మీద కూడా విచారణ
  • ఎమ్మెల్యేలు సీహెచ్ రమేశ్, గ్యాదరి కిషోర్ మీదా కేసులు 
  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార పార్టీ నేతలు 


బీఆర్ఎస్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. మంగళవారం  వచ్చిన కోర్టు తీర్పులు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేయగా, మరో మంత్రికి సంబంధించిన అఫిడవిట్ వ్యవహారంలో విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఓ ఎంపీ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒకే రోజున ఒక ఎంపీ, ఒక మంత్రి, ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పులు రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావు ఎన్నికలు చెల్లవంటూ ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యతిరేకంగా తీర్పులు వస్తే ఐదేళ్లపాటు వారు పోటీకి అనర్హులు అవుతారు. ఇదే ప్రస్తుతం అధికార పార్టీకీ ముచ్చెమటలు పట్టిస్తున్నది.


ముద్ర, తెలంగాణ బ్యూరో:రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు, నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కోర్టులలో వివాదాలన్నీ  కొలిక్కి వస్తున్నాయి. తీర్పులు వ్యతిరేకంగా వస్తే దాని ప్రభావం వచ్చే ఎన్నికలలో ఉంటుందన్న భయం అధికార పార్టీలో నెలకొంది. ఇదే వారిని పరేషాన్ చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రకటించింది. ఆయన ఐదేళ్లు పోటీకి అనర్హుడంటూ తీర్పు నిచ్చింది. ఇదే రోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారంలోనూ హైకోర్టులో చుక్కెదురైంది. తన మీద వేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు కోర్టును ఆశ్రయించారు. నామినేషన్ వేసిన సమయంలో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్ స్థానంలో, కౌంటింగుకు రెండు రోజుల ముందు వెబ్ సైట్ లో మరో అఫిడవిట్  కనిపించడంతో వివాదం రాజుకుంది. ఒకసారి నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత అఫిడవిట్ ను తొలగించడం సాధ్యం అయ్యేపని కాదు. దీనికి ఎన్నికల సంఘం అధికారులు సహకరిస్తే తప్ప సాధ్యం కాదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాఘవేందర్ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి కోర్టుకు వెళ్లారు. రాఘవేంద్రరాజు పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న బెంచ్ శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేసింది. 

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు కూడా గట్టి షాక్ తగిలింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఎంపీగా బీబీ పాటిల్ ను రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోలేదంటూ ఆయన ప్రత్యర్థి కె. మదన్ మోహన్ రావు తెలంగాణ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ లోపు బీబీ పాటిల్ తనపై విచారణ నిలిపేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు బీబీ పాటిల్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఏ విషయమైనా తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని తిప్పి పంపింది.  దీంతో పాటిల్ షాక్ తినక తప్పలేదు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. కౌంటింగులో గోల్ మాల్ జరిగిందంటూ ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతోంది. వేములవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమేనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై హైకోర్టులో విచారరణ జరుగుతోంది. ఈ అంశంపై తీర్పు వస్తే ఆయనపై వేటు పడి ఉపఎన్నిక వస్తుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే  ఆయన విదేశాలలో ఎక్కువ ఉంటూ నియోజకవర్గంలో తక్కువ ఉంటున్నారనే ప్రచారం ఉంది. గ్యాదరి కిషోర్ కు సంబంధించి కూడా కోర్టులో కేసు కొనసాగుతోంది. ఆయనకు వ్యతిరేకంగా, కౌంటింగ్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ   కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోర్టును ఆశ్రయించారు. వీటిపై తీర్పు వస్తే ఎన్నికల ముందు పార్టీకి చాలా డామేజ్ అవుతుందన్న టెన్షన్ అధికార పార్టీలో నెలకొంది.

  • సుప్రీంకోర్టుకు వనమా

తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నామని వనమా వెంకటేశ్వర్ రావు తెలిపారు. జన బలంతో, మెజారిటీ ఓట్లతో గెలిచానని పేర్కొన్నారు. తన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఎవరిని మోసం చేయలేదన్నారు. న్యాయస్థానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.