సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మృతి

సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మృతి
  • పత్రికా రంగానికి తీరని లోటు: సీఎం
  • మంత్రులు, నేతలు, జర్నలిస్టు సంఘాల నివాళి

ముద్ర, తెలంగాణ బ్యూరో:సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) గురువారం ఉదయం కన్నుమూశారు. యేడాది కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు ఆంగ్ల, తెలుగు దినపత్రికలలో వివిధ హోదాలలో సుదీర్ఘ కాలం పని చేశారు. డెక్కన్ క్రానికల్ న్యూస్ బ్యూరో చీఫ్‌గా18 యేళ్లకు పైగా సేవలందించారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.  కృష్ణారావు తన 47 యేళ్ల కెరీర్ లో జర్నలిజం రంగంపై అచంచలమైన అంకితభావానికి నిదర్శనంగా నిలిచారు. 1975లో ఒక స్ట్రింగర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తన వార్తా కథనాలు, కాలమ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆయన రాతలు, మాటలూ సూటిగా ఉండేవి. నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మాట్లాడేవారు. టీవీ న్యూస్ ఛానళ్లలో చర్చలలో పాల్గొనడం ద్వారా వీక్షకులకి చిరపరిచితులు అయ్యారు. కృష్ణారావు మృతికి ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు వై. నరేందర్ రెడ్డి, సోమసుందర్, కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్​ అలీ సంతాపం తెలిపారు. జర్నలిజంలో ఆయన అందించిన సేవలు, సాధించిన విజయాలను కొనియాడారు. 

  • సీఎం సంతాపం

కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పలు రంగాలలో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇందిరారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కె. కేశవరావు, నామ నాగేశ్వర్ రావు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కృష్టారావు మృతికి సంతాపం తెలిపారు.