‘మూసీ’కి విముక్తి 

‘మూసీ’కి విముక్తి 
  • విస్తరణకు తొలగిన అడ్డంకులు
  • నదీ తీరాన ఉన్న పేదలకు ‘డబుల్’ ఇండ్లు 
  • పది వేల ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం
  • అడ్డంకులు తొలిగాక మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం 
  • సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో:మూసీ నది విస్తరణకు అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. మూసీకి ఇరువైపులా నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానున్నాయి. సుమారు పది వేల ఇండ్లను వీరికి కేటాయించాలని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది బాధితులకు మెరుగైన ఇండ్లను కేటాయించడం ద్వారా విస్తరణ పనులను శరవేగంగా చేపట్టాలని భావిస్తోంది. ఇప్పఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని శాసనసభ్యులతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసీకి అడ్డుగా ఉన్న అక్రమణలను తొలగించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

  • వారు సురక్షిత ప్రాంతాలకు

మూసీ తీరాన ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అత్యంత పేదరికంతో దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతోపాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసీని అన్ని విధాలుగా సంరక్షిస్తామన్నారు. అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఎస్ ఎస్ఎన్డీపీ రెండవ దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ నిరంతరంగా కొనసాగుతుందన్నారు.
 
వచ్చే వారం నుంచి ఇండ్ల పంపిణీ

ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో గుర్తించిన లబ్ధిదారులకి ఇండ్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో గత పది సంవత్సరాలలో జరిగిన విస్తృతన అభివృద్ధిని పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. వరద నివారణ కోసం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.