ఎన్నికలు ఏకపక్షమే!

ఎన్నికలు ఏకపక్షమే!
  • బీఆర్ఎస్​దే భారీ విజయం
  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షమేనని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వెలువడిన ఎన్నికల షెడ్యూల్ పై మంత్రి స్పందించారు. ప్రజలు ఇప్పటికే రెండు సార్లు  తమను నిండు మనసుతో ఆశీర్వాదించారని, మూడోసారి కూడా విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్​బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. కేసీఆర్​హ్యాట్రిక్ సాధించి దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తారని పేర్కొన్నారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి రాష్ట్ర ప్రజలు పట్టం కడతారని, పదేండ్ల ప్రగతే మా ఎన్నికల పాశుపతాస్త్రం అని కేటీఆర్​అన్నారు. విశ్వసనీయతే మా విజయమంత్రమని, జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనమన్నారు.

బీఆర్ఎస్ కెప్టెన్ కేసీఆర్..

సీఎం కేసీఆర్​బీఆర్ఎస్ పార్టీ కెప్టెన్ అని, అందుకే మా టీంలో రోజురోజుకు హుషారు పెరుగుతోందని కేటీఆర్​అన్నారు. మరోసారి ప్రతిపక్షాలు బేజారు కావడం తథ్యమని, మంచిచేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు వేసి గెలిపిస్తారని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతుందన్నారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప గాడ్సే రాద్ధాంతం నడవదన్నారు. 2014లో ఉద్యమ చైతన్యం తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించిందని, 2018లో సంక్షేమ సంబురం రెండో ఎన్నికను గెలిపించిందన్నారు. 2023లో మూడో ఎన్నికను శాసించేది ముమ్మాటికీ మన పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం అని కేటీఆర్​అన్నారు. ఈసారి బీఆర్ఎస్​పార్టీ తన పాత రికార్డులు తిరగరాయడం ఖాయమని, ఈసారి సెంచరీ కొట్టడం తథ్యమని కేటీఆర్​పేర్కొన్నారు.

డిసెంబర్​3న తెలంగాణకు విముక్తి
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : డిసెంబర్​3న తెలంగాణకు విముక్తి కలగబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రానికి పట్టిన చీడ నుంచి తెలంగాణకు విముక్తి లభించనుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని అన్నారు. డిసెంబర్​3న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందని, రాబోయే  విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధమని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో చర్చకు రావాలన్నారు. అందుకోసం తేదీ చెప్పాలని, అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాము సిద్ధం అని కేటీఆర్, హరీశ్​రావుకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని,  పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని విమర్శించారు. 

అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారు..

అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందని, కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని, వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. డిసెంబర్ లో అద్భుతం జరగబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి మహిళలను ఆదుకుంటామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ ఇంటికి  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15వేలు అందిస్తామని చెప్పారు. సంపద పెంచాలి పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదని, వారు ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలని రేవంత్​రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

బీజేపీ విజయం తథ్యం
50 రోజులు అవిశ్రాంతంగా కష్టపడతాం
బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్ రెడ్డి తెలిపారు. కేవలం రెండో, మూడో స్థానం కోసమే కాంగ్రెస్ , బీఆర్ఎస్ పోటీ పడాలన్నారు. సోమవారం జహీరాబాద్ కు చెందిన ఢిల్లీ వసంత్, ఇల్లందుకు చెందిన కొందరు నేతలు కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను స్వాగతిస్తున్నామని, పూర్తిస్థాయిలో ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామని, తెలంగాణ ప్రజలు కోరుకునే మార్పు బీజేపీ ద్వారానే సాధ్యమన్నారు. అధికార మార్పుకు ఇంకా 50 రోజులు సమయమే ఉందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 50 రోజులు బీజేపీ శ్రేణులు కష్టపడి పనిచేస్తారన్నారు. 

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి..

అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా , అధికార దుర్వినియోగం లేకుండా నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు కిషన్​రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటుందని ఆరోపించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనే నీచ సంస్కృతిని తెలంగాణకు అందించిన ఘనత సిఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి రూ.15 కోట్ల చొప్పున డబ్బును బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పంపించారని ఆయన ఆరోపించారు. ఆ డబ్బులతో ఇతర పార్టీల నాయకులను కొంటున్నారని దుయ్యబట్టారు. నిజాయితీగా పనిచేసే నాయకులు కాకుండా కేవలం డబ్బులు ఉన్నవారే గెలిచేతట్లు వాతావరణాన్ని కేసీఆర్ మార్చారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, పింఛన్లు పోతాయనే దుస్ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరువీరులు కలలుకన్న బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు.

మూడోసారి కేసీఆరే సీఎం!
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ మూడోసారి సీఎం అవడం ఖాయమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం దారుస్సలాంలోని ఎంఐఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు ఎంఐఎం పార్టీ సిద్ధంగా ఉందని, తెలంగాణతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లోని మైనారిటీలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సామాజిక సాధికారత విషయంలో మైనారిటీలు ఇంకా వెనుకబడే ఉన్నారని ఆయన తెలిపారు.