నాకో బండి ఉంది రాష్ట్రంలో పెరిగిన వాహనాలు

నాకో బండి ఉంది రాష్ట్రంలో పెరిగిన వాహనాలు
  • కోటి దాటిన టూ వీలర్లు
  • 20 లక్షలకు పైగా కార్లు
  • సొంత రవాణాపైనే మక్కువ
  • ప్రతి ముగ్గురికి ఒక బండి 
  • గ్రేటర్​పరిధిలోనే 82 లక్షల వాహనాలు
  • యూత్​కు నయా మాడల్​ వాహనాలు

రాష్ట్రంలో వాహనాల సంఖ్య 

(తెలంగాణ వచ్చినప్పుడు) 84.67 లక్షలు

యేడాది    |   మొత్తం వాహనాలు    |  టూ వీలర్లు    |   కార్లు

2021             |          1,46,62,604             |   1,08,432         | 18,51,232

2022–23     |           1,54,77,512              |   1,13,96,830  |  20,14,751


రాష్ట్రంలో రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. వరుసగా మూడేండ్ల నుంచి వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. 2020లో1.28 కోట్లు ఉన్న వాహనాల సంఖ్య 2021 నాటికి 1.46 కోట్లకు చేరింది. ఈ యేడాది కూడా వాహనాల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.54 కోట్ల వాహనాలున్నాయని రవాణా శాఖ వెల్లడించింది. వీటిలో 1.13 కోట్లు ద్విచక్ర వాహనాలే. గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలో వాహనాల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 1.54 కోట్ల వాహనాలలో జీహెచ్​ఎంసీ పరిధిలో 82 లక్షలున్నాయి. నిరుడు ఈ సంఖ్య 71.15 లక్షలు. గ్రేటర్​లో రవాణా కష్టాలు పెరుగుతుండటంతో సొంత బండ్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు తప్పడం లేదు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర స్టాటిస్టికల్​ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో మొత్తం కోటి కుటుంబాలు ఉండగా, అంతకు మించి వాహనాలు ఉన్నాయి. గత అయిదేళ్లలో 8.16 రెట్లకు మించి వాహనాలు పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణా శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వాహనరంగంలో వస్తున్న మార్పులు, న్యూ మోడల్స్​కారణంగా అత్యాధునిక వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. కొన్ని రకాల వాహనాల కొనుగోళ్లు తొమ్మిది నుంచి పది రెట్ల వరకు పెరగటం విశేషం. ఇక, మోపెడ్ల నుంచి రోల్స్‌ రాయిస్‌ కార్ల వరకు హైదరాబాద్‌ రహదారులపై చక్కర్లు కొడుతున్నాయి.

గ్రేటర్​లో ఫికర్​
రోజురోజుకూ పెరుగుతున్న వెహికల్స్​ గ్రేటర్‌ ను మరింత ట్రాఫిక్‌ సమస్యలోకి నెట్టేస్తున్నాయి. సిటిజన్లు రద్దీ రోడ్లపై బస్సుల్లో జర్నీ కంటే కార్లు, బైకులనే నమ్ముకుంటున్నారు. మెట్రోరైల్ వచ్చినా కనెక్టివిటీ సరిగా లేక సొంత వాహనాల్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు. దీంతో  సిటీ రోడ్లన్నీ వెహికల్స్‌తో నిండిపోతున్నాయి. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టు రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్​జామ్​అయ్యి ప్రజలు నడిరోడ్డుపై నరకం చూస్తున్నారు. నిజానికి కరోనా తరువాత సిటీలో పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌ తగ్గింది. దీంతో సొంత​వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఇంటికి మూడు నుంచి ఐదు వెహికల్స్ అయ్యాయి. ఇలా రెండేండ్ల క్రితం 67 లక్షలు ఉన్న ద్విచక్ర వాహనాల సంఖ్య ఈ యేడాది మార్చి నాటికి 1.13 కోట్లకు చేరింది. రోజూ 65 లక్షల వాహనాలు సిటీ రోడ్లపై తిరుగుతున్నట్లు అంచనా. దీంతో సిటీ ట్రాఫిక్ అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టు రోడ్ల విస్తరణ లేకపోవడంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ బస్సులలో జర్నీ ఆలస్యమవుతుడడంతో గ్రేటర్ చుట్టు ప్రక్కనల ప్రాంతాల నుంచి సొంత వాహనాలపైనే చాలా మంది వస్తున్నారు. 

ఖరీదైన కార్ల జోరు
రాష్ట్రంలో ఖరీదైన కార్ల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. వాహన విఫణిలోకి వచ్చిన అత్యంత ఖరీదైన ఎలాంటి వాహనమైనా హైదరాబాద్‌ రోడ్లపై పరుగులు పెట్టాల్సిందేనని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 50 లక్షల రూపాయ‌ల‌ నుంచి కోటి రూపాయ‌ల విలువ చేసే కార్లు యేటా 300 నుంచి 500 వరకు పెరుగుతున్నాయి. కోటి రూపాయ‌లు.. అంతకుమించి విలువైన కార్లు ఏటా వందకుపైగా రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. కొన్ని రకాల ద్విచక్రాల వాహనాలు కూడా ఖరీదైనవే రోడ్లపైకి వస్తున్నాయి. ఖరీదైన వాహనాల్లో 75 నుంచి 80 శాతం వరకు హైదరాబాద్‌ నగరంలోనే రిజిస్టర్‌ అవుతుండ‌డం విశేషం. 2014లో రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉన్న వాహనాలు 160 ఉంటే.. 2022 నాటికి ఈ సంఖ్య ఏకంగా 2400కు చేరింది. నిరుడు కోటికిపైగా ఉన్న కార్లు 227 రిజిస్ట్రేషన్​ అయ్యాయి. 

75 శాతానికిపైగా టూ వీలర్లు
తాజా గణాంకాల ప్రకారం మోటారు వాహనాల సంఖ్య 1,54,77,512. రాష్ట్రంలో 1.54 కోట్ల వాహనాల్లో మోటార్ సైకిళ్లు , కార్లు కలిపి 85 శాతానికి పైగా ఉన్నాయి. 1.54 కోట్ల వాహనాల్లో వాహనాల్లో 1,13,96,830 మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. కార్లు 20,14,751గా నమోదయ్యాయి. ఇక, అటో రిక్షాలు 4,55,756, కాంట్రాక్ట్​ క్యారేజీలు 9244, ఈ రిక్షాలు 235, విద్యా సంస్థల వాహనాలు 28,962, గూడ్స్​ క్యారేజీలు 6,09,442, మాక్సీ క్యాబ్​లు 31,060, మోటర్​ క్యాబ్​లు 1,20,337, ప్రైవేట్​ సర్వీస్​ వెహికిల్స్​ 3145, స్టేజీ క్యారేజీలు 17,956, ట్రాక్టర్లు, ట్రేలర్లు 7,01,959, ఇతర వాహనాలు 87,835 ఉన్నాయి. ఇక,  హైదరాబాద్‌లోనే 82 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, అందులో 67 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, 10 లక్షలకుపైగా కార్లు ఉన్నాయి. కరోనా పరిస్థితుల తర్వాత రాష్ట్రంలో వాహనాల కొనుగోళ్లు 18 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.