ఎలా అమ్ముతారు? తెలంగాణకు ఏపీ షాక్​

ఎలా అమ్ముతారు? తెలంగాణకు ఏపీ షాక్​
  • భూముల అమ్మకానికి సిద్ధమైన టి–సర్కార్
  • రూ,20 వేల కోట్ల నిధుల సేకరణకు ప్రణాళిక
  • కమిటీ నియామకం.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
  • దిల్, హౌజింగ్​ భూములు అమ్మాలని నిర్ణయం
  • మాకూ వాటా ఉంది కదా.. విక్రయానికి వీల్లేదు
  • అడ్డం తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • తమ వాటా క్లియర్​ చేయాలంటూ కోర్టులో పిటిషన్​
  • కేంద్రానికీ ఫిర్యాదు.. నోరు మెదపని సెంటర్ 
  • ఏపీకి అనుకూలంగా షీలా బీడే కమిటి నివేదిక
  • 9వ షెడ్యూల్ ఆస్తుల వ్యవహారంతో మెలిక


అప్పులు రాక, ఆదాయ మార్గాలు లేక పెరిగిన ఖర్చుల కోసం భూముల అమ్మకాలపై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాక్​ తగులుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దిల్, హౌసింగ్​ భూముల విక్రయాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ భూములను విక్రయిస్తే దాదాపు రూ.20 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం భావించింది. వీటి అమ్మకాల కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసింది. ఉన్నకాడికి భూములను అమ్మేద్దామంటూ నిర్ణయించింది. సంక్షేమ పథకాలతో పాటుగా పలు ప్రధాన స్కీంలు అమలు చేయాలంటే ఈ భూముల అమ్మకం తప్పదని భావించింది. కానీ, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీతో ఉన్న చిక్కులు తేలకపోవడం, కేంద్రం కూడా ఏదీ తేల్చకపోవడంతో ఈ భూముల అమ్మకం ఆగిపోతున్నది. 

మీరెలా అమ్ముతారు?
ఈ భూముల విక్రయాలపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వానికి ఊహించని షాక్​ తగిలింది. వీటిలో తమకు 58 శాతం వాటా ఉందని ఏపీ ఎదురు తిరుగుతున్నది. విభజన చట్టం ప్రకారం 9వ షెడ్యూల్​ కింద ఈ ఆస్తులున్నాయని, తమ వాటా తేల్చకుండా ఈ భూములను ఎలా అమ్ముతారని నిలదీస్తున్నది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. కోర్టులో పిటిషన్ కూడా వేసింది. నిజానికి, 9వ షెడ్యూల్‌ కింద పేర్కొన్న 91 సంస్థలు, 10వ షెడ్యూల్‌ కింద పేర్కొన్న 142 సంస్థలు నేటికీ సందిగ్ధంలోనే  ఉన్నాయి. అనేక సందర్భాలలో ప్రధానిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.


ముద్ర, తెలంగాణ బ్యూరో :
హౌసింగ్​బోర్డు పరిధిలో హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎలాంటి వివాదాలు లేని భూములున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 820 ఎకరాలున్నాయి.  విలువైన ప్రాంతాలుగా మారిన నిజాంపేట, మల్లంపేట, అబ్దుల్లాపూర్​మెట్, పటాన్​చెరు పరిధిలోనే ఆరు వందల ఎకరాలకుపైగా భూములుండటంతో వీటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని అమ్మకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హౌసింగ్​ బోర్డు పరిధిలో మొత్తం 3,337 ఎకరాల భూములున్నాయని గుర్తించారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చాక హౌసింగ్ బోర్డు డమ్మీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో బలహీనవర్గాల గృహ నిర్మాణం ఈ బోర్డు ద్వారా జరిగేది. ఈ బోర్డుతో నష్టాలే తప్ప లాభాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. ప్రస్తుతం వివిధ జిల్లాల పరిధిలో బోర్డుకు వందలు, వేలాది ఎకరాల భూములున్నాయని లెక్క తేలింది. వీటిని ప్లాట్లుగా చేసి అమ్మాలనే ప్రతిపాదనల పాత ఫైలును ఇప్పుడు ప్రభుత్వం ముందటేసుకుంది. 3,337ఎకరాలలో ప్రస్తుతం 820 ఎకరాలను విక్రయించేందుకు సిద్ధమైంది. 

4,999 ఎకరాల ‘దిల్’​ భూములు
దక్కన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అండ్ ల్యాండ్‌‌ హోల్డింగ్స్‌‌ (దిల్‌‌) కు సంబంధించి 4,999.14 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. వీటి కేటాయింపులు రద్దు చేసింది. ఈ సంస్థకు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్​నగర్​ ఉమ్మడి జల్లాల పరిధిలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు నిరూపయోగంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లుగా 2015 ఆగస్టులో జీఓ జారీ చేసింది. హౌసింగ్​ బోర్డుకు అనుబంధంగా ఏర్పడిన ‘దిల్’ కు పారిశ్రామిక అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ భూములు కట్టబెట్టింది. సదరు సంస్థలు యేండ్లు గడిచినా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ యేడాదీ భూములే దిక్కు
నిజానికి, ఈ యేడాది ప్రభుత్వం భారీ బడ్జెట్​ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని పథకాల కోసం భూములను అమ్ముతామని స్పష్టం చేసింది. దీనిలో హౌసింగ్, దిల్​ భూములున్నాయి. వీటిద్వారా రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నది. వచ్చేదంతా ఎన్నికల కాలం కావడంతో, ఈ భూములను అమ్మి, పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆగస్టులోగా సంక్షేమ పథకాలను అమలు చేసి, వారికి నిధులు విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే దిల్, హౌసింగ్​ భూములను అమ్మి నిధులను సమకూర్చుకోవాలని భావించింది. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులే దిక్కు. 

ఇవన్నీ ఇంకా పెండింగే
పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్‌9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు- 91 సంస్థలను, షెడ్యూల్‌10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌ సహా 142 సంస్థల ఆస్తులు, ఇతర లావాదేవీలను 58:42 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కేంద్రం దేన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది. 91 సంస్థలలో  షీలా బీడే కమిటీ- 68 సంస్థలకు చెందిన ఆస్తులను పాక్షికంగా పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై బీడే కమిటీ- చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా, సమస్యాత్మకంగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్‌ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. వీటిలో హౌసింగ్, దిల్​ భూములున్నాయి. పంచాయతీ తేలితేనే విక్రయాలు చేపట్టాల్సిన పరిస్థితి. హౌసింగ్​కు విశాఖలో కూడా 160 ఎకరాల భూమి ఉంది. 

తేలడం లేదు.. అమ్మకం కుదరదు
భూముల విక్రయాలపైనే ఆశలు పెట్టుకున్న ప్రభుత్వానికి విభజన సమస్యలు తేలకపోవడం అడ్డుగా మారింది. కేంద్రానికి విన్నవించినా ఏపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిరుడు ఈ ఆస్తుల పంపకాలపై సమావేశం ఏర్పాటు చేసినా, ఎటూ తేల్చలేదు. కొన్ని వివాదం లేని భూములను అమ్ముదామని ప్రభుత్వం భావిస్తే, అటు కేంద్రం, ఇటు కోర్టు నుంచి నోటీసులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ భూములను విక్రయించడంపై ముందకెళ్లడం లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్నది. వచ్చే ఎన్నికల కాలం కోసం నిధుల కోసం తండ్లాట మొదలైంది.