నేతల గన్​ లైసెన్స్​లకు తాత్కాలిక బ్రేక్​ 

నేతల గన్​ లైసెన్స్​లకు తాత్కాలిక బ్రేక్​ 
  • ఈ నెల 16 లోపు  పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలి
  • హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు
  • నగరంలో 1587 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు
  • పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

 
ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అదనంగా జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్స్ అధికారులు 24 గంటల పర్యవేక్షణ  ఉంటుందని ఆయన తెలిపారు. మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. 15 వీడియో సర్వైలెన్స్ బృందాలు, 15 వీడియో వీక్షణ బృందాలు అన్ని విభాగాలలో పనిచేయడం ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వ వాహనాలు,  ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రభుత్వ యంత్రాంగాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అలాగే అన్ని ప్రధాన ర్యాలీలు, బహిరంగ సభలను రికార్డు చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో 1587 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 32 కంపెనీల కేంద్ర బలగాల సహాయాన్ని కోరామన్నారు. ఎవరివద్దనైనా  లైసెన్స్ తుపాకీలు ఉంటే వెంటనే డిపాజిట్ చేయాలంటూ కమిషనర్ ​సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16 లోపు దగ్గరలోని  పోలీస్ స్టేషన్లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఒక వేళ అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదలై.. అంతా సర్దుకున్నాక డిసెంబర్ 10 తర్వాత వచ్చి తమ వెపన్స్ తీసుకోవాలని  ఆనంద్ కోరారు.