‘కాగ్​’లో ఏముంది?! | Mudra News

‘కాగ్​’లో ఏముంది?! | Mudra News
  • కాళేశ్వరం పనులపై హెవీ అబ్జెక్షన్స్​
  • మూడుసార్లు పరిశీలించిన కాగ్​ బృందం
  • థర్డ్ టీఎంసీ పనులను తప్పు పట్టినట్లుగా అనుమానాలు
  • కాగ్​ రిపోర్ట్​ ఇవ్వని తెలంగాణ సర్కారు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం మరో ఆనవాయితీకి మంగళం పాడింది. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల చివరి రోజున ఇవ్వాల్సిన కాగ్​ నివేదికను ఈసారి పక్కన పెట్టింది. దీంతో అసలు కాగ్ రిపోర్ట్​ లో ఏముందనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రధానం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్​ బృందం మూడుసార్లు పరిశీలించడంతో.. అనుమానాలన్నీ అటువైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం థర్డ్​ టీఎంసీ పనులపై అన్ని సంస్థలు అబ్జెక్షన్స్​ చెప్పుతుండటంతో కాగ్​ రిపోర్ట్​ లో తప్పులు ఎత్తిచూపారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీంతో పాటుగా పలు పథకాలకు నిధులు వెచ్చించడం, సచివాలయంతో పాటుగా పలు పనులకు విపరీతంగా అంచనాలు పెరుగడంతో ప్రభుత్వంపై కాగ్​ అక్షింతలు వేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి కారణాలతోనే కాగ్​ నివేదికను ప్రభుత్వం విడుదల చేయకుండా ఆపేసినట్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆఖరి రోజైనా కాగ్ రిపోర్టులు ఈసారి సభలో ప్రవేశ పెట్ట లేదు. రాష్ట్రంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితులను వెల్లడించే రిపోర్టులు బయటకు రాలేదు. ఈ అంశంపై  అసెంబ్లీ లాబీల్లో కూడా చర్చ జరిగింది. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గతేడాది ఆడిట్ రిపోర్టులను ఇంకా రెడీ చేయలేదని, అందుకే ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు. ఏటా జనవరి నెలాఖరులోనే కాగ్ తమ ఆడిట్ రిపోర్టులను గవర్నర్ కు అందజేస్తాయి. గవర్నర్ ఆమోదంతో వీటిని అసెంబ్లీ ముందు ఉంచుతారు. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారం కావస్తున్నా  గవర్నర్ కు ఈ రిపోర్టులు అందలేదు. దీంతో కాగ్ రిపోర్టుల తయారీలో ఎందుకు ఆలస్యం చేసిందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మార్చింది.

గతంలోనూ అభ్యంతరాలు
తెలంగాణ స్వరాష్ట్రంలో ముందు నుంచీ బడ్జెట్​ పద్దులపై కాగ్​ నివేదిక కీలక అంశాలు బయట పెడుతున్నది. నిరుడు ఇచ్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల కల్పనపై తగిన శ్రద్ధ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ మిగులు లేదు, అప్పుల కోసమే అప్పులు అని, ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని, ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని పేర్కొంది. ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయని తెలిపింది. బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని ప్రభుత్వం అధిగమనించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అప్పటి వరకు తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారని, 75 శాతానికిపైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారని, దీంతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందని,  విద్య, వైద్యరంగాలపై తక్కువ ఖర్చు కొనసాగిందని కాగ్ నివేదికలో తప్పులు ఎత్తి చూపించారు.  వెల్లడించింది. ఇలా రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఏటా రెవిన్యూ మిగులు చూపించగా, అదంతా ఉత్తిదేనని కాగ్ ఆడిట్లో బయటపడింది. 

వ్యూహమేనా?
ప్రస్తుతం కాగ్​నివేదిక బయటకు రాలేదు. అసలు గవర్నర్​ వద్ద ఉందా.. అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరిందా అనే అనుమానాలను ప్రభుత్వం తరుపున నివృత్తి చేయడం లేదు. దీంతో 2022 మార్చి నాటి ఆడిట్ రిపోర్టులో ఏముంది, రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయిందా, రెవిన్యూ లోటు మరింత ఆందోళన పరిస్థితికి చేరిందాఅనేది ఆసక్తి రేపింది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపైనా కాగ్​ బృందం సూక్ష్మ పరిశీలన చేసింది. ప్రధానంగా అదనపు టీఎంసీ పనుల వివరాలు అడిగింది. ఇరిగేషన్​ నుంచి దాదాపు నాలుగైదు పర్యాయాలు వివరాలు కోరింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్​ రిపోర్టులో కీలక అంశాలు దాగి ఉన్నాయని అధికారవర్గాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిపోర్టుల తయారీలో కాగ్ లేట్ చేసిందా లేక  ప్రభుత్వమే ప్లాన్ ప్రకారమే రిపోర్టుల తయారీకి మోకాలడ్డిందా అనే సందేహాలు  వ్యకమవుతున్నాయి. అంతేకాకుండా కాగ్​ బృందం గుర్తించిన  అభ్యంతరాలన్నీంటిపైనా కాగ్ ముందుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపించి అనుమానాలపై వివరాలు తీసుకోవడం సాధారణమే. వాటికి నిర్ణీత గడువులోగా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు పంపించడంలో కూడా ప్రభుత్వం ఆలస్యం చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా ముందుగా పెట్టడంతో ఆర్థిక శాఖ నుంచి సరైన వివరాలు రాలేదని, దీంతో రిపోర్టులు ఆలస్యమయ్యాయని కొంతమంది సీనియర్​ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించే కీలక నివేదికలను ప్రభుత్వం దాచి పెట్టింది. 

ఎప్పడిస్తారో?
ఈ ఏడాదికి సంబంధించిన కాగ్​ నివేదికలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటికే ముందస్తు ఎన్నికల సంకేతాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరిగితే మధ్యలో ఓసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే చాన్స్​ ఉంటుంది. కానీ, అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అంశంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సాధించింది. ఒక్క రోజు, రెండు రోజులే సభలు ఉంటున్నాయి. దీంతో నిరుటి కాగ్​ రిపోర్ట్​ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ ఇవ్వాలంటే వచ్చే యేడాది బడ్జెట్​ సమావేశాలలోనే.