తప్పిన లెక్క!

తప్పిన లెక్క!
  • తగ్గిన ఆదాయం 47 వేల కోట్లు
  • పెరిగిన మిత్తి 1,577 కోట్లు
  • రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ‘కాగ్’ ​నివేదిక

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు తారుమారయ్యాయి. ఆదాయం అంచనాలు తలకిందులయ్యాయి. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. బడ్జెట్​అంచనాల్లో కొన్ని శాఖలకు కేటాయింపుల కంటే అదనంగా నిధులు విడుదల అయ్యాయి. మొత్తం 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా ఖర్చు చేసినట్లు తేలిపోయింది. రాష్ట్ర అర్థిక స్థితిగతులపై కంప్ర్టోలర్ అండ్​అడిటర్​జనరల్(కాగ్) రూపొందించిన నివేదికను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021–-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక ఇచ్చింది. 

  • అంచనా తగ్గింది..

రాష్ట్ర ఆదాయం రూ. 2,21,687 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసినట్లు కాగ్​ వెల్లడించింది. అయితే, వచ్చిన ఆదాయం రూ. 1,74,154 కోట్లు గా చూపించింది. దీంతో రెవెన్యూ లోటు రూ. 6,744 కోట్లని, రెవెన్యూలోటులో రూ.9,335 కోట్లకు పెరిగిందని కాగ్‌ తెలిపింది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 1,09,992 కోట్లు కాగా కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్స్ రూ. 8, 619 కోట్లని, ప్రణాళికేతర వ్యయం రూ. 32, 979 కోట్లు, జీతాలకు రూ.30,951 కోట్లు, మౌలిక వసతులకు రూ.28,308 కోట్లని కాగ్ పేర్కొంది. కాగా, రాష్ట్ర ఆదాయం, ప్రణాళికలో వేతనాలు, ఖర్చులు, సబ్సిడీలు, వడ్డీల సొమ్ము మినహాయిస్తే.. అభివృద్ధి కోసం రూ. 1.20 లక్షల కోట్లు వెచ్చించినట్లుగా వెల్లడించారు. ఇక, క్యాపిటల్​ ఎక్సెపెండిచర్​లో మేజర్​ ఇరిగేషన్​కు పెద్ద పద్దు ఖర్చు చేసినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. మేజర్​ ఇరిగేషన్​కు రూ. 12,024 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.5,559 కోట్లు కేటాయించారు. 

  • వడ్డీలు పెరిగిపోయాయి..

రాష్ట్ర ప్రభుత్వ పద్దులో వడ్డీలు గణనీయంగా పెరిగిపోయినట్లు కాగ్​నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీల కింద రూ.19.161 కోట్లు చెల్లించినట్లు నివేదికల్లో వెల్లడించారు. వడ్డీల చెల్లింపునకు బడ్జెట్​లో రూ.17,584 కోట్లు కేటాయింపులు చేస్తే.. ఇది రూ. 19,161 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా 2017–18లో వడ్డీల కింద రూ. 10,835 కోట్లు, 2018–19లో రూ. 12,586 కోట్లు, 2019–20లో రూ. 14,385 కోట్లు, 2020–21లో రూ, 16,841 కోట్లు వడ్డీల కింద చెల్లించగా.. 2022 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ సొమ్ము మరింత పెరిగింది. దీంతో రూ. 19,161 కోట్లను మిత్తీల కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

  • ఎక్కువ వాడేశారు..

నీటిపారుదల, వైద్యం, పంచాయతీరాజ్‌ శాఖలకు 34 శాతం అధికంగా ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు పెట్టిందని, 289 రోజల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీని వినియోగించిదని, 259 రోజులపాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ సౌకర్యం వినియోగించిందని పేర్కొంది. 100 రోజలపాటు రూ.22,669 కోట్ల ఓవర్‌ డ్రాప్ట్‌కు ప్రభుత్వం వెళ్లిందని, 2020–-21లో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటుకు రాష్ట్రం వెళ్లిందని స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని, రాష్ట్రం అప్పు జీఎస్టీలో 27.40 శాతమని కాగ్‌ నివేదికలో పేర్కొంది. 2021–-22లో రాష్ట్రంలో పన్ను ఆదాయం 37 శాతం కాగా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయని వెల్లడించారు. జీఎస్టీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. బడ్జెట్​ కేటాయింపుల్లో మొత్తం 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా ప్రభుత్వం వ్యయం చేసిందని పేర్కొంది.

  • మద్యం అమ్మకాల ట్యాక్స్​రూ.17 వేల కోట్లు

రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పన్నులు ఏటేటా పెరిగినట్లు స్పష్టమైంది. స్టేట్ ఎక్సైజ్​కలెక్షన్లలో ఈ ఏడాది రాష్ట్ర పన్ను వాటాగా రూ.17,482 కోట్లు వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ. 14,370గా కాగ్​ చూపించింది. ఇక, వాహనాల ట్యాక్స్​ల ద్వారా రూ. 4381 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్న స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ. 12,373 కోట్లుగా నమోదైంది. గతంలో కంటే రెండింతలుగా ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. 202‌‌‌0–21లో స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 5243 కోట్లు వచ్చాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా రూ. 12 వేల కోట్లు దాటింది. 

  • పన్నుల వాటా పెరిగింది..

పన్నుల వాటా కింద రాష్ట్రానికి 2‌‌021–22లో రూ. 91,271 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా కాగ్​నివేదిక వెల్లడించింది. 2020–21లో ఈ ఆదాయం రూ. 66,650 కోట్లుగా ఉంది. ఇక, కేంద్రానికి పన్నుల వాటా రూపంలో 2021–22లో రూ. 18,721 కోట్ల ఆదాయం నమోదు కాగా, అంతకు ముందు ఏడాది రూ. 12,692 కోట్లుగా ఉంది. నాన్​ ట్యాక్స్​ రెవెన్యూగా రూ. 8857 కోట్లు నమోదైనట్లుగా కాగ్​ నివేదిక వెల్లడి చేసింది. 

  • అతి తక్కువగా స్కాలర్​షిప్​లకే..!

రాష్ట్ర ఖర్చుల్లో అతి తక్కువగా స్కాలర్​షిప్​, స్టైఫండ్​కు వెచ్చించినట్లుగా వెల్లడైంది. మొత్తం ఆదాయంలో వేతనాలు, ఇతర ఖర్చులకు రూ. 32,979 కోట్లు ఉండగా, వడ్డీలకు రూ. 19,161 కోట్లు, పెన్షన్లకు రూ. 14,025 కోట్లు, సబ్సిడీలకు రూ. 10,218 కోట్లు ఉంది. ఇక స్కాలర్​షిప్​లు, స్టైఫండ్​కోసం రూ. 2579 కోట్లు విడుదల చేసినట్లుగా కాగ్​ పేర్కొన్నది. ఖర్చుల్లో స్కాలర్​షిప్​లకు కేటాయించింది 1.56 శాతం మాత్రమే. 

  • రూ.1.35 లక్షల కోట్లకు హామీ..

రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు రూ. 1,35,283 కోట్లకు గ్యారంటీగా ఉందని కాగ్​నివేదిక స్పష్టం చేసింది. 2021–-22లో ఆర్థిక సంస్థల నుంచి వివిధ సంస్థలు, విభాగాలు తీసుకున్న అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటున్నది. 2020–21 వరకు రూ. 1.05 లక్షల కోట్లుగా ఉన్న గ్యారంటీ రుణాలు.. 2022 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక, ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా రూ. 19,531 కోట్లు వచ్చినట్లుగా కాగ్​ రిపోర్ట్​లో స్పష్టమైంది.