ఈడీ, మోడీ, బోడీకి భయపడను

ఈడీ, మోడీ, బోడీకి భయపడను
  • విచారణ సంస్థలకు సహకరిస్తా
  • ఢిల్లీలో మీడియాతో ఎమ్మెల్సీ కవిత

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఈడీ, మోడీ, బోడీ, ఎవరికీ భయపడనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విచారణ సంస్థలకు సహకరిస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్​ పార్టీని చూసి భయపడుతున్నారన్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను తమలాంటి నేతలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఢిల్లీలో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈడీ జారీ చేసిన నోటీసుల‌పై స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది తమ డిమాండ్ అని తెలిపారు. ఇందు కోసమే  ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని హెచ్చరించారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ‘దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షాపరులకు గుర్తుచేస్తున్నా’ అన్నారు.  ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామన్నారు.