గద్దర్‌ సంస్మరణ`సిపిఐ నారాయణ

గద్దర్‌ సంస్మరణ`సిపిఐ నారాయణ

‘‘1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే, 1930 నుండి తెలుగు సాహిత్యాన్ని నేన నడిపించాను. కవిత్వంలో ఇది నాయుగం’’ అన్నాడు శ్రీశ్రీ. గద్దర్‌ ఇది నా శకం అనలేదు కానీ ప్రజల పోరాబాటలో గద్దర్‌ తన పాట, ఆటలతో గద్దర్‌కు ముందు, గద్దర్‌ తరువాత అన్న ముద్ర బలంగా వేశాడనే నా భావన. దీనిని ఎవరు అంగీకరించినా, వ్యతిరేకించినా వచ్చే నష్టమే లేదు. దేనికి పనికి రాని ఓ జంతువునైనా, మనిషినైనా వాటిజీవితం వృథా అనుకుంటాం. ఇది సహజం. మనిషిలో ఉండే కరుణ, మానవత్వాలకు నిదర్శనం. నాగరిక లోకంలో ఉన్నామనుకుంటూ, చావును కూడా తూర్పారబట్టే అనాగరికులు కూడా మన మధ్యే ఉంటారని తాజాగా తెలుసుకున్నాం. అంతులేని నిర్భంధాలు, రాజ్యహింస చవిచూసి, ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం వామపక్షాలతోపాటు, రాడికల్స్‌ కూడా బహిరంగ సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం వచ్చింది.

ఈ నేపథ్యంలో తిరుపతి కోనేటికట్టలో జరిగిన బహిరంగసభలో త్రిపురనేని మధుసూదనరావు ఉపన్యాసం, గద్దర్‌ పాట, ఆట శ్రోతల్లో ఒక ఊపు తీసుకువచ్చాయి. అప్పటికే నేను సిపిఐ పార్టీ తరపున తిరుపతిలో విద్యార్థి, యువజనోద్యమ బాధ్యుడుగా పని చేస్తున్న రోజులు. మొదటిసారిగా త్రిపురనేని మధుసూదనరావు, గద్దర్‌ ద్వయాన్ని అసభలో చూశాను. త్రిపురనేని మధుసూదనరావు తిరుపతి గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. విరసంలో ప్రముఖ పాత్ర త్రిపురనేనిది. వారి స్వరం ధీర గంభీరం, వారి ఉపన్యాసాన్ని పశు పక్ష్యాదులు కూడా చెవులు రిక్కించి వింటాయన్నట్లుండేది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు గద్దర్‌ ఆటా పాటలతో యువతకు ఉత్తేజం, సామాన్యులకు విప్లవ సందేశం, మేధావులకు మేధోమథనం, కళాకారులకు ‘‘కళ కళ కోసం కాదు, ప్రజల కోసం’’ అన్న ఆలోచన కలుగజేస్తూ, ఉభయులు ప్రేక్షకులకు కాచివడపోసిన చురుకు పుట్టించే ‘విప్లవ అరుకు’ త్రాగించి పంపించేవారు.

అప్పటి నుండి గద్దర్‌ నాకు తెలుసు కానీ, గద్దర్‌కు నేను తెలియదు. నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక గద్దర్‌ గారితో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. నన్నెప్పుడూ ప్రోత్సహించేవాడు. ఉద్యమ నేపథ్యంలో కొన్ని సందర్భాలలో వివిదాలు నాతోపాటు పయనించేవి. ఆ విమర్శలనెదుర్కునే క్రమంలో గద్దర్‌ మాత్రం ‘‘ఏయ్‌ నారన్నా మనిద్దరం అంతే. నువ్వు ముందుకుపో’’ అని వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. సిపిఐ కూడా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలపరిచాక, ఉద్యమంలో  కలిసి పాల్గొన్నాం. తెలంగాణలోని కోల్‌బెల్ట్‌ ఏరియాలో అనేక బహిరంగ సభలలో వేదిక పంచుకున్నాం. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేశాం. ప్రతి సందర్భంలో ప్రజలకు ఆత్మీయంగా వారి పద్దతిలో పరిచయం చేసేవాడు.

మహబూబాబాద్‌ సభకు యువకుడిలా సూటుబాటు వేసుకుని, మంచి గెటప్‌లో వచ్చాడు. వారిని ఆ గెటఫ్‌లో చూసి, ‘ గద్దరన్నా నీకు మంచి పిల్లను చూసి లగ్గం చెయ్యాలె’ అన్నా. నవ్వుకుంటూ నీదే ఆలస్యం, అలాగే చూడే అని హాస్యమాడాడు. ఎక్కడన్నా కనబడితే నారన్నా నాకు పెండ్లెప్పుడే అని సరసమాడేవాడు. గద్దర్‌లో విప్లవ భావాలతోపాటు, సరదాగా సరసంగా మాట్లాడటంలో వారికే వారే సాటి. గద్దర్‌ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా వారివెంటే నడిచాయి. నక్సల్స్‌ ఉద్యమంలో విభేదాలతో బయటకు వచ్చినా, వారి మౌలిక విధానాలను వదిలిపెట్టలేదు. ఎవరేమన్నా గద్దర్‌ కలం, గళం, కరచణాలు ప్రజల ప్రయోజనార్థమే. ఎన్ని వివాదాలకు లోనైనా, వారునమ్ముకున్న కళకు కళంకం రాకుండానే కాపాడుకున్నారు. ఆ నిబద్ధతతోనే వారి చివరి శ్వాస వరకూ వారి ఆట పాటను ఉన్నత స్థాయిలోనే ఉంచి శాశ్వతంగా సమాజహితానికి వదిలి, శారీరకంగా మనల్ని వదలి వెళ్ళారు.

సాయుధ పోరాటం, ఎన్నికల బహిష్కరణ వాదాలను సమర్థించినా చివరికి వాస్తవ పరిస్థితిని గమనించి ఎన్నికలలో కూడా పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చారు. దీనిని అతివాదుల నుండి మితవాదుల వరకు, వ్యక్తిగత కోపతాపాలుంటే వారితో సహా ఎందరో విమర్శలు చేసి ఉండవచ్చు. అలా అయితే మరో ప్రపంచం, ‘‘మరో ప్రపంచం, మరో ప్రపంచం అంటూ’’, భుగ భుగలాడిన  శ్రీశ్రీ కూడా విమర్శకు అతీతుడేంకాలేదు. అయితే ఏమి, నాడు ఇది నా యుగం అని గర్వంగా ప్రకటించుకున్నాడు. నేడు ‘‘ ఇది గద్దర్‌ శకం’’ అని వారితరపున ప్రకటించడానికి సంశయించాల్సిన పనేంలేదు. విశ్వ విద్యాలయాలు గద్దర్‌ పేరుతో పరిశోధనలు చేస్తే గద్దర్‌ శకం అభినందిస్తుంది. ఇవే గద్దరన్నకు నా అరుణారుణ వందనాలు`నివాళులు.

డాక్టర్‌ కె.నారాయణ , 
సిపిఐ జాతీయ కార్యదర్శి ,
అజయ్‌ భవన్‌, న్యూఢల్లీి.
మొబైల్‌ :9490952222.