ఎన్నికల ప్రక్రియకు పటిష్ట చర్యలు

ఎన్నికల ప్రక్రియకు పటిష్ట చర్యలు

కరీంనగర్ సీపీ ఎల్ సుబ్బరాయుడు
 
ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రాబోవు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సజావుగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు కరీంనగర్ కమీషనరేట్ లోని అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు, రెవెన్యూ, ఇతర విభాగాలకు చెందిన అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ఎన్నికల ఘట్టాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల అధికారులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో శుక్రవారం నాడు పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కమీషనరేట్ లోని వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి అవసరాన్ని ముందుగా గుర్తించి నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. 

ఎన్నికల సందర్భంగా అల్లర్లు జాగరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను, అక్రమ కార్యకలాపాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని చెప్పారు. గత ఎన్నికల సందర్భంలో జరిగిన నేరాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమాస్యాత్మక ప్రాంతాలను గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతర్ జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసుల్లో ఎలాంటి వారెంట్లు పెండింగ్ లో ఉండకూడదని సూచించారు. అన్ని స్థాయిలకు చెందిన అధికారులు  వివరాలను నమోదు చేసే ప్రక్రియలో సదరు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలలోని రూట్లు, ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై స్పష్టమైన సమాచారం సేకరించబడి ఉండాలని తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది వసతి సౌకర్యాలపై కూడా పగడ్బందీ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన  కేసుల నమోదు చేయాలని సూచించారు.

ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కమీషనరేట్ లోని అన్నిస్థాయిలకు చెందిన అధికారులకు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదిలికలు కొనసాగుతున్నందున ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనాల తనిఖీల సందర్భంగా వాహన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పట్టుబడిన ధ్రువపత్రాలపై ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత రవాణాశాఖ అధికారులను సంప్రదించాలని సంప్రదించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలను ప్రతిరోజు కొనసాగించాలన్నారు. వారం రోజుల పరిధిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన దాదాపు అన్ని రకాల సంబంధించిన నివేదికలు తయారు కావాలని ఆదేశించారు.