60 సార్లు రక్త దానం.. ప్రాణదానంలో ప్రథముడు బేతి మహేందర్ రెడ్డి

60 సార్లు రక్త దానం.. ప్రాణదానంలో ప్రథముడు బేతి మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రక్తదానం ఒక ప్రాణాన్నే కాదు కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో అత్యంత అరుదైన "ఓ" నెగటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేస్తూ ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడడంతో పాటు నేటివరకు 60 సార్లు రక్తదానం చేయడం జరిగిందని బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం నగరంలోని అపెక్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన రాగల్ల గంగ (14 ఏళ్లు) రక్తహీనతతో బాధపడుతూ ఓ నెగటివ్ రక్తం కోసం బీజేపీ అనుబంధ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దూలం కళ్యాణ్ ను సంప్రదించగా విషయాన్ని బేతి మహేందర్ రెడ్డి కి తెలుపగా వెంటనే స్పందించి కరీంనగర్ బ్లడ్ సెంటర్ లో ఓ నెగటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేసి రోగి ప్రాణాలు కాపాడడం జరిగిందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఓ నెగటివ్ రక్తాన్ని 60 సార్లు దానం చేయడం జరిగిందని, ఈ రక్తదానం చేస్తూ ఎందరో జీవితాలను నిలబెట్టడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని ఇది అందరికి సాధ్యం కాదని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రఘునందన్ రావు, సెక్రటరీ సిరికొండ శ్రీధర్ రావు, స్పోర్ట్స్ అండ్ లైబ్రరీ సెక్రటరీ దాడి ఓంకార్, సీనియర్ కార్యవర్గ సభ్యులు జగదీశ్వర చారి, సమూహా ఫౌండేషన్ సభ్యులు నాగమల్ల సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ కుమార్ తదితరులు అభినందించారు.