ఆచీతూచీ!

 ఆచీతూచీ!
  • అభ్యర్థిత్వాల ఎంపికపై కాంగ్రెస్​పకడ్బందీ వ్యూహం
  • సర్వేలతోపాటు పరిగణనలోకి సామాజిక సమీకరణాలు
  • పార్టీ ఫిరాయింపులకు చెక్​పెట్టేలా ప్రమాణ పత్రాలు
  • టిక్కెట్లకు ఫీజు రుసుము పెంపు

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్​ఆచీతూచీ వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది కారెక్కిన విషయం తెలిసిందే. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏఐసీసీ ఈసారి కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చింది. 

  • ఫిరాయింపులకు చెక్​పెట్టేలా!

కాంగ్రెస్​నుంచి గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు దిగకుండా చెక్​ పెట్టేలా.. ఈ సారి అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాల స్వీకరణకు సిద్ధమైంది. పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తామంటూ బాండ్​పేపర్​మీద రాయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి టిక్కెట్ల కోసం అభ్యర్థుల నుంచి వసూలు చేసే రుసుమును నాలుగింతలు చేసింది. ఓసీ అభ్యర్థులకు రూ.50వేలు, బీసీ ఆశావాహులకు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితమని ఖరారు చేసింది. 

  • సర్వే నివేదికలే ప్రామాణికం కాదు..

మరోవైపు.. మొన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేనే ప్రమాణికంగా తీసుకుంటామని.. జనాదరణ కలిగిన నేతలకే టిక్కెట్లు ఇస్తామని చెప్పిన అధిష్టానం.. తాజాగా సర్వే నివేదికలే ప్రామాణికంగాకాదని, సామాజిక అంశాలనూ పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించించడం సంచలన సృష్టిస్తోంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో కొనసాగుతోన్న చేరికలు, బలపడుతోన్న బీసీలకు అత్యధిక సీట్ల డిమాండ్​ఇప్పటికే ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో రెండు సార్లు అధికారం కోల్పోయినా.. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా తమతమ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ నాయకులు ఈ సారి టిక్కెట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం పని చేస్తున్న ఆయా నేతలు తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. 

  • టార్గెట్​83!

వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలకు దగ్గర్లో ఉన్న 83 స్థానాలపై గెలుపుబావుటా ఎగురవేసేందుకు కాంగ్రెస్​వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్​ వ్యూహకర్త సునీల్​కనుగోలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్​ గెలుపు అవకాశాలను ఇప్పటికే నివేదిక రూపంలో టీపీసీసీకి అందజేశారు. 41 స్థానాల్లో కాంగ్రెస్​ కచ్చితంగా గెలుచుకుంటుందని అంచనా వేసిన సునీల్​ బృందం.. 42 స్థానాల్లో కొంచెం కష్టపడితే గట్టెక్కుతుందని నివేదించిన విషయం తెలిసింది. మరో 36 స్థానాల్లో బీఆర్ఎస్​అభ్యర్థులు బలంగా ఉన్నారని, ఆయా సెగ్మెంట్లలో జనం అధికార బీఆర్ఎస్​ వైపే మొగ్గుచూపుతున్నారని అక్కడ గెలవడం కష్టమని వివరించింది. ఈ నివేదిక ప్రకారం కచ్చితంగా గెలవనున్న 41, కష్టపడితే గెలిచే 42 సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు టీపీపీసీ కసరత్తు చేస్తోంది. 

  • వంద సీట్లు గెలుస్తాం : రేవంత్​

సునీల్​కనుగోలు నివేదిక ఆధారంగా వంద సీట్లు గెలుస్తామని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఇటీవల ప్రకటించారు. మరోవైపు బీసీ నేతలకు అత్యధిక టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్​బలపడుతుండడంతో వాటిని అధిగమించే వ్యూహాలపైనా ఎన్నికల కమిటీ, టీపీసీసీ దృష్టిసారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ నేతలు డిమాండ్​చేస్తున్న స్థానాల్లో అధికార బీఆర్ఎస్​ నేతలను ఢీ కొట్టే బలమైన అభ్యర్థులు లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలి..? బీసీ నేతలను నచ్చజెప్పే భారాన్నిటీపీసీసీ నేతలు ఏఐసీసీకి అప్పజెప్పాలని భావిస్తున్నారు.

  • బలమైన అభ్యర్థుల వేట..!

వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తోన్న ఏఐసీసీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించింది. ఆగస్టు 18 నుంచి 25 వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై సీనియర్ నేత  దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సబ్​కమిటీ ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసింది. మరో రెండ్రోజుల్లో ఈ నివేదికను టీపీసీసీకి అందజేయనుంది. వచ్చిన దరఖాస్తులను ఎన్నికల కమిటీ స్క్రీనింగ్​ నిర్వహించి అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. వచ్చేనెల మొదటి వారంలోగా దరఖాస్తులను పరిశీలించి.. అదేనెల రెండో వారంలో 40 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్​భావిస్తోంది. ఇదిలావుంటే..ప్రస్తుతం కాంగ్రెస్​ లో 70కి పైగా సెగ్మెంట్లలో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. పలు నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు ఆశావాహులు టిక్కెట్ల కోసం తమతమ స్థాయిల్లో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సీనియర్ల ద్వారా అధిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే.. ఇంకొందరు టిక్కెట్టు రాకపోతే పార్టీ మారుతామంటూ ఆల్టీమేటం జారీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు తమతమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు టీపీసీసీ నేతలను కాదని ఏఐసీసీ స్ధాయిలో పైరవీలు మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో టిక్కెట్ల వ్యవహారం హస్తంలో ఎలాంటి అలజడి రేపుతుందోననే ఆసక్తి నెలకొన్నది.