రేపటి నుంచి  ముఖ్యమంత్రి అల్పాహార పథకం

  రేపటి నుంచి  ముఖ్యమంత్రి అల్పాహార పథకం
  • రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న కేసీఆర్
  • బ్రేక్ ఫాస్ట్ మెనూలో కిచిడి, పొంగలి, ఉప్మా, రాగి జావ, గుడ్డు
  • రాష్ట్రంలోని 28,807 స్కూళ్లలో 23,05,801 విద్యార్థులకు లబ్ధి


ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 6 నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదివేలా ప్రోత్సహించేందుకు, వారిలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 

పథకం అమలుకు ఏటా రూ.400 కోట్లు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని ఉదయం పూట ఉచితంగా అందజేస్తారు. అల్పాహార పథకం మెనూలో కిచిడీ, పొంగలి, ఉప్మాను పెట్టనున్నారు. అలాగే రాగిజావ, ఉడికించిన గుడ్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,807 పాఠశాలల్లోని  23,05,801 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అనేక మంది విద్యార్థులు పాఠశాలకు సమయానికి చేరుకోవాలని ఉద్దేశంతో అల్పాహారం తినకుడానే స్కూల్ కు రావడం, కొంతమంది విద్యార్థులు కుటుంబ పరిస్థితుల కారణంగా అల్బాహారం తీసుకోకుండా వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మంచి పోషకాహారం అందించేలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అల్బాహారం పథకాన్ని తీసుకొచ్చింది. అల్పాహార పథకం అమలు కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లను ఖర్చు చేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని దసరా సెలవుల అనంతరం ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉండటంతో అంతకు ముందుగానే ఈ పథకం ఆమలుకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్​4 నుంచే ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెద్ద మొత్తంలో గౌరవ వేతనం, బిల్లులు పెండింగ్ లో ఉన్నందున , ఆ చెల్లింపులు పూర్తి చేసిన తర్వాతే ఈ నెల 6 నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.