పార్లమెంట్​ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్​పొత్తు

పార్లమెంట్​ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్​పొత్తు
  • పార్టీల ఎంపీలే నాతో చెప్పారు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కేసీఆర్ పనే!
  • ఎంఐఎం ఎటువైపు ఉంటుందో చెప్పాలి
  • టీ పీసీసీ చీఫ్ రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్​మధ్య పొత్తు ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పొత్తు ఉంటుందని ఆయా పార్టీల ఎంపీలు తనతో చెప్పారని పేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్​లో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేయనున్నాయని, ప్రస్తుతమున్న 4 సిట్టింగ్​ స్థానాలతోపాటు మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, చేవెళ్ల లోక్‌సభ స్థానాలను బీజేపీ కోరిందని, పొత్తుపై కూడా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ తన సీటును కూడా బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు బీఆర్ఎస్​ఎంపీ స్వయంగా తనతో చెప్పారని రేవంత్​వెల్లడించారు.

బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్​బంధం

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ.. కాంగ్రెస్​గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఓట్లను చీల్చి బీఆర్ఎస్ గెలుపునకు దోహదపడుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్​బంధమని తాము ముందు నుంచే చెబుతున్నామని.. తమ మాటలను మోడీ నిరూపించారన్నారు. సీఎం కేసీఆర్​ఆదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అధిష్ఠానం మార్చిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోడీ చెప్పాల్సిందని అన్నారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు విచారణ చేపట్టడంలేదని రేవంత్​ప్రశ్నించారు. బీఆర్ఎస్​దోపిడీలో బీజేపీకి వాటాలు వెళ్తున్నాయని, అందుకే కేసీఆర్ పై మోడీ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ ను గెలిపించేందుకే తెలంగాణలో మోడీ పర్యటిస్తున్నారన్నారు. 

మద్దతుపై ఎంఐఎం పునరాలోచన చేయాలి..

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిన మోడీ.. గడిచిన పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్​ కు ఇస్తున్న మద్దతుపై ఎంఐఎం పునరాలోచన చేయాలని రేవంత్​రెడ్డి కోరారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ పెట్టుకున్న బీఆర్ఎస్​తో ఎలా మద్దతు ఇస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ను ప్రశ్నించారు. ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్​వైపు నిలబడతారా..? లేక తమ వైపు ఉంటారా.? నిర్ణయం తీసుకోవాలన్నారు. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ముతోనే మోడీని ఆయన దర్బార్​లో సన్మానించారని రేవంత్​ఆరోపించారు. ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్​దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.