వీడని భయం!

వీడని భయం!
  • బీఆర్ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థులకు రెబల్స్ ​బెడద
  • ఇండిపెండెంట్​గా బరిలోకి దిగేందుకు ప్రణాళిక
  • పఠాన్​చెరు, మహబూబ్​నగర్, ఖానాపూర్, రామగుండం, కూకట్ పల్లి, నల్గొండలో రెబల్స్?
  • సిట్టింగ్​ల కంటే అధికంగా ప్రచారం
  • బంబేలెత్తుతున్న బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు 


ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​పార్టీలో సిట్టింగ్ అభ్యర్థులకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు వారికి ఎదురు తిరుగుతున్నారు. పార్టీ అధిష్ఠానం పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోయినప్పటికీ ఎన్నికల బరిలో ఉంటామని బహిరంగంగానే  చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్​అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పేట్లు కనిపించడం లేదు.

ఉద్యమకారులల్లో భగ్గుమన్న అసంతృప్తి..

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నవారిలో చాలా మందికి టికెట్లు లభించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయినా పలువురు నేతలకు టికెట్ దొరకలేదు. కనీసం మూడో దఫా అయినా పోటీ చేయాలని వారు గట్టిగా ప్రయత్నించారు. కానీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 7 నియోజకవర్గాలు మినహా మిగిలిన సిట్టింగ్ లందరికి మళ్లీ టికెట్లు ఇచ్చారు. దీంతో టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్న నేతల్లో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా కొందరు నేతలు ఇప్పటికే బీఆర్ఎస్​పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇతర పార్టీల్లో చేరి టికెట్లు తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కాగా మరికొందరు పార్టీలోనే కొనసాగుతూ స్వతంత్ర్య అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తున్నది. దీంతో వారిని ఓటమి భయం వెంటాడుతోంది.  వారిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం పలుమార్లు యత్నించినప్పటికీ ఆశావహులు వెనకడుగు వేయడం లేదు. తగ్గేదేలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధమేనని ఏకంగా పార్టీ అధినేతకే సవాల్ విసురుతున్నారు.

అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్న రెబల్స్..

రాష్ట్రంలోని 115 అసెంబ్లీ సెగ్మెంట్లకు సీఎం కేసీఆర్  ఒకే జాబితాలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి దాదాపు నెలపైగా అవుతోంది. అయినా ఇప్పటివరకు ఆశావహులు దారికి రాలేదు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ప్రధానంగా ఖానాపూర్, పటాన్​చెరు, మహబూబ్​నగర్, రామగుండం, కూకట్ పల్లి, నల్గొండ తదితర నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కేసీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు. ఆమె స్థానంలో భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆమె కాంగ్రెస్ లోకి వెళతారని నిన్నమొన్నటిదాకా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో ముఖ్యులను కలుసుకుంటూ తనను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఇక పఠాన్ చెరు నియోజకవర్గంలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే అవకాశం దక్కింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకుడు నీలం మధు కూడా రెబల్ గా బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని యువత, కాలనీ సంఘాలను కలుసుకుంటూ తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. సిట్టింగ్ అభ్యర్థి కంటే నీలం మధు ప్రచారం జోరుగా సాగుతుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఖంగుతింటున్నాయి. ఇక పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా రెబల్స్ బెడద తప్పేట్టు కనిపించడం లేదు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి నిమిషం వరకు యత్నించిన మున్నూరు రవి కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ మంత్రికే ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రచారం..

రామగుండం నియోజకవర్గంలోనే ఇదే  పరిస్థితి నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ కొనసాగుతుండగా, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి చివరి నిమిషం వరకు యత్నించారు. ఆమెకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇందుకు నిరసనంగా రెండు రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. కోరుకుంటి చందర్ ఓటమే లక్ష్యంగా రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. అలాగే నల్గొండ జిల్లాలో కూడా సిట్టింగ్ ఎమ్మలెయే కంచెల భూపాల్ రెడ్డి కూడా పార్టీ సీనియర్ నాయకుడైన పిల్లి రామరాజు యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని అసంతృప్తి నేతలనంతా తనవైపుకు తిప్పుకుని కంచెర్లకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మరోసారి పునరాలోచన చేసి అభ్యర్థిని మార్చని పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని వెల్లడించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారావు కూడా సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీ అధిష్ఠానం మరోసారి ఆయనకే పోటీ చేసే అవకాశం కల్పించినప్పటికీ అక్కడి నుంచి రెబల్ గా బరిలోకి దిగేందుకు మరో సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంకా  తెగని స్టేషన్​ఘన్​పూర్​పంచాయతీ..

స్టేషన్ ఘన్ పూర్, జనగామ పంచాయతీ ఇంకా తేలలేదు. స్టేషన్  ఘన్ పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్​అవకాశం కల్పించారు. దీనిపై గుర్రుగా ఉన్న రాజయ్య.. అవసరమైతే బీఆర్ఎస్​కు గుడ్ బై చెప్పి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు స్వయంగా వెల్లడించారు. దీంతో కడియం శ్రీహరికి కుడా రెబల్ బెడద తప్పేట్టు కనిపించడం లేదు. ఇక జనగాం నియోజకవర్గాన్ని కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆయనకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే యాదగిరిరెడ్డి చివరి నిమిషం వరకు టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఒకవేళ పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే  స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా ఒకటి, రెండు సమయం ఉండడంతో కొందరు నేతలు ఇంకా టికెట్ల ఆశలు పెట్టుకున్నారు.