మంత్రి శ్రీనివాస్ ​గౌడ్ ​పై హై కోర్టుకు నివేదిక

మంత్రి శ్రీనివాస్ ​గౌడ్ ​పై హై కోర్టుకు నివేదిక
  • సోమవారం తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​గౌడ్​ఎన్నికల అఫడవిట్​ట్యాంపరింగ్​కేసు కీలక దశకు చేరుకున్నది. ఇప్పటికే మంత్రిపై కేసుకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. మంత్రితో సహా 11 మంది అధికారులపైనా మహబూబ్​నగర్​ పీఎస్​లో కేసు నమోదైంది. అయితే దీనిపై వాదనల సందర్భంగా పూర్తి వివరాల కోసం హైకోర్టు.. అడ్వకేట్​కమిషన్​ను నియమించింది. ఈ కమిషన్​ఇటీవల మంత్రి శ్రీనివాస్​గౌడ్​తోపాటుగా ఆయన సతీమణిని విచారణ చేసింది. ఎన్నికల్లో సమర్పించిన అఫడవిట్​పై ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్​కమిషన్.. తమ పూర్తి నివేదికను హైకోర్టుకు గురువారం సమర్పించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టారు. ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత.. సోమవారం తుది తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. 

కాగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​అఫిడవిట్​ట్యాంపరింగ్​కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయంలో అధికారుల తీరును తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి నెలకొన్నది. ఇటీవల అడ్వకేట్​కమిషన్​ముందు విచారణ సందర్భంగా కూడా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాట వేసినట్లు తెలిసింది. పింఛన్​జమ అయ్యే ఖాతా విషయంలో ఏటీఎం కార్డు తన డ్రైవర్​ దగ్గర ఉంటుందని, మంత్రి భార్య బ్యాంకు ఖాతా, లాకర్ విషయం తనకు తెలియదంటూ దాట వేసినట్లుగా న్యాయవాదులు వెల్లడించారు. వీటన్నింటిపైనా అడ్వకేట్ కమిషన్​నివేదిక ఇచ్చింది. దీంతో సోమవారం తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది.