లైఫ్ సైన్సెస్‌కు హ‌బ్‌గా హైదరాబాద్

లైఫ్ సైన్సెస్‌కు హ‌బ్‌గా హైదరాబాద్
  • త్వరలోనే లైఫ్ సైన్స్ యూనివర్సిటీ 
  • రెండేళ్లలో ఈ రంగంలో భారీ పెట్టుబడులు
  • రూ. 788 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్​ 
  • జీనోమ్ వ్యాలీలో భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
  • సువెన్​ఫార్మాకు రూ.9,589 కోట్ల ఎఫ్డీఐ
  • ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి

ముద్ర, తెలంగాణ బ్యూరో:తెలంగాణ రాజధాని హైదరాబాద్ లైఫ్ సైన్సెస్‌కు హ‌బ్‌గా మారింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.  రెండేండ్లుగా ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే  లైఫ్ సైన్స్ యూనివ‌ర్సిటీని ప్రారంభిస్తామ‌న్నారు. రాష్ట్రంలో రూ. 788 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్న సింజీన్ సైంటిఫిక్ సొల్యూష‌న్స్ న్యూ క్యాంపస్ కు గురువారం జీనోమ్ వ్యాలీలో మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పెట్టుబ‌డుల ద్వారా వెయ్యి మందికి ఉపాధి ల‌భించ‌నుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూష‌న్స్ అతి ముఖ్యమైన కంపెనీ అని చెప్పారు. ఈ కంపెనీ ఏర్పాటుతో హైద‌రాబాద్ లైఫ్ సైన్స్ రంగం మ‌రింత ముందుకు వెళుతుందన్నారు. బెంగ‌ళూరుతో పోల్చితే హైద‌రాబాద్ న‌గ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. కేసీఆర్ వంటి దమ్మున్న ముఖ్మమంత్రి ఉండడం వలననే తెలంగాణ శరవేగంగా ప్రగతిని సాధిస్తోందన్నారు. కంపెనీల కోసం ఎవ‌రి వెంట తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజులలోనే అనుమ‌తులను ఇస్తున్నామన్నారు. వారు పెడుతున్న ప్రతి రూపాయికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు సంస్థకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.

సువెన్​ఫార్మాకు రూ.9,589 కోట్ల ఎఫ్డీఐ

హైదరాబాద్‌కు చెందిన సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో రూ.9,589 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సైప్రస్​కు చెందిన బెర్హాండా లిమిటెడ్‌ ఈ పెట్టుబడులను పెట్టనుంది. సువెన్‌ ఫార్మా ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, తద్వారా మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఈ నిధులను వినియోగించుకోనుంది. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీతోపాటు ఆర్‌బీఐ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పరిశీలించాకే ఈ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పెట్టుబడుల ద్వారా బెర్హాండా లిమిటెడ్‌కు సువెన్‌ ఫార్మాలో 76.1 శాతం వాటా లభించనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా రంగ కంపెనీలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నేరుగా అనుమతి ఉంది. బ్రౌన్‌ఫీల్డ్‌ ఫార్మా కంపెనీలలో 74 శాతం వాటా ఎఫ్‌డీఐలను మాత్రమే నేరుగా అనుమతిస్తున్నారు.