ఎంత దూరం! ఇల్లెంత దూరం!!

ఎంత దూరం! ఇల్లెంత దూరం!!
  • అడుగడుగునా పనులకు ఆటంకాలు
  • ముందుకు సాగని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
  • 61 వేల నిర్మాణాలు ఇంకా మొదలే కాలే
  • పాత రేట్ల ప్రకారం చేయలేమంటున్న కాంట్రాక్టర్లు
  • ధరలను సవరించేందుకు ఒప్పుకోని సర్కారు 
  • మధ్యలోనే ఆగిపోయిన 69 వేల ఇండ్లు 
  • ఇతర పనులలో లబ్ధి చేసేందుకు ఎమ్మెల్యేల ప్లాన్​
  • అయినా ముందుకు రాని గుత్తేదారులు

ఎనిమిదేండ్లుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు ముందుకు సాగడం లేదు. 2.91 లక్షల ఇండ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి దాకా1.13 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో లబ్ధిదారులకు ఇచ్చింది 23 వేల ఇండ్లు మాత్రమే. అసలు నిర్మాణమే మొదలు కానివి 61,606 ఉన్నాయి. ఇంకా నిర్మాణాలు మధ్యలో సాగుతున్న ఇండ్లు ‌‌‌69 వేలు ఉన్నాయి. తాజాగా ఈ ఇండ్లన్నీ పూర్తి చేసి 2023 జనవరి15 నాటికే లబ్ధిదారులకు అప్పగించాలని సర్కారు టార్గెట్ గా పెట్టుకున్నది. కానీ, మార్చి నెల వచ్చినా ఆ ఊసెత్తడం లేదు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లు.. సర్కారుకు షాక్​ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాలన్నీ ఆపేశారు. ఒక్కో ఇంటికి లక్ష రూపాయలు లాస్​ వస్తుందని లెక్కలేసి చూపించారు. కనీసం లాస్​ వచ్చే సొమ్మునైనా సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనుకకు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాంట్రాక్టర్లు అడ్డు తగులుతున్నారు. 2016 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు అప్పగించారని, కానీ, ఇప్పుడు కనీసం 30 శాతం వరకు నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయంటున్నారు. దీంతో ఇండ్లు నిర్మించలేమంటూ వదిలేస్తున్నారు. ఇటు లబ్ధిదారులు ‘డబుల్’​ ఇండ్ల గురించి  ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గ్రామాలలో అడ్డుకుంటున్నారు. కనీసం కొన్ని ఇండ్లైనా ఇచ్చి ఎలాగోలా హామీ నిలబెట్టుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డబుల్​ బెడ్​ రూం ఇండ్లు నిర్మించే కాంట్రాక్టర్లకు తాజాగా విడుదలవుతున్న రోడ్ల పనులకు లింకు పెడుతున్నారు. ఈ రోడ్ల టెండర్లు వారికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని, ఆ పనులలో చూసీచూడట్లుగా వ్యవహరిస్తామని, దానికి బదులుగా డబుల్ ఇండ్లను పూర్తి చేయాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు ఎంతో కొంత ముందుకు వస్తున్నారు. కానీ, చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే లక్షలు లాస్​ అయ్యామని, రోడ్ల పనులు ఇచ్చినా డబుల్​ ఇండ్ల పనులు చేయలేమంటూ తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి డబుల్ ఇండ్ల నిర్మాణ ధరలు సవరించాలని ఇటు అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. కానీ, ఫైల్​ ముందుకు కదల్లేదు. గతంలో పెండింగ్​ బిల్లుల కోసం పట్టుబట్టిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ధరలను సవరించాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రస్తుతం పాత బిల్లులను కొంతమేరకు క్లియర్​ చేస్తున్నారు. ఇంకా రూ. 50 కోట్ల వరకు మాత్రమే బకాయిలున్నాయి. వీటిని విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. అయినా కాంట్రాక్టర్లు మాత్రం పనులకు ముందుకు రావడం లేదు. 

Mudra Epaper

ఎంత దూరం! ఇల్లేంత దూరం!!

https://epaper.mudranews.in/c/71842655

https://epaper.mudranews.in/c/71846213

ఈ డబుల్ ఇండ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాలలో  రూ. 5.04 లక్షలు, మౌలిక వసతుల కోసం రూ. 1.25 లక్షల చొప్పున మొత్తం రూ. 6.29 లక్షలు కేటాయించారు. అర్బన్​ లో నిర్మాణానికి రూ. 5.30 లక్షలు, ఇన్​ఫ్రా కోసం రూ. 75 వేలచొప్పున రూ. 6.05 లక్షలు, జీహెచ్​ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణానికి రూ. 7 లక్షలు, ఇన్​ఫ్రా కోసం రూ. 7.75 వేల చొప్పున రూ. 7.75 లక్షలుగా యూనిట్​ కాస్ట్​ ఖరారు చేశారు. రూ. లక్ష చొప్పున అదనంగా ఖర్చు పడుతుందని కాంట్రాక్టర్లు అంటున్నారు. 

అప్పులతోనే నిర్మాణాలు
2015 అక్టోబర్‌‌‌‌‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ఇండ్ల సంఖ్య 2,91,057గా ఉంది. ఇందులో 2,73,534 ఇండ్లకు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2,29,451 ఇండ్లకు టెండర్లు పిలిచారు. 1.13 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. 61,606 ఇండ్లు పనులు ఇంకా మొదలు కాలేదు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇండ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రూ.8,744 కోట్లు హడ్కో నుంచి, రూ. 800 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14,786 కోట్లకు బడ్జెట్ శాంక్షన్స్ ఇచ్చినప్పటికీ.. ఇందులో రూ.2 వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఇవి కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన కింద రాష్ట్రానికి వచ్చిన నిధుల నుంచే అడ్జెస్ట్​ చేశారు. 

పంపిణీ కూడా ప్రయాసే
పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందిన ఇండ్లు 23 వేల లోపే. 90 వేల దాకా ఇండ్లు సిద్ధంగా ఉన్నా పంపిణీ చేయడం లేదు. మౌలిక వసతలును అధికారులు కారణంగా చూపిస్తున్నారు. కొంత మందికే ఇండ్లు పంపిణీ చేస్తే లక్షల సంఖ్యలో అర్హుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పంపిణీని పెండింగ్​ పెడుతున్నట్లు సమాచారం. సొంత జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ఈసారి బడ్జెట్‌‌‌‌‌లో సర్కార్ నిధులు కేటాయించింది. ఇది మొదలుపెట్టాకే ఇండ్లు పంపిణీ చేయాలని, ఎన్నికలకు ముందు పంపిణీ చేస్తే రాజకీయంగా కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. 2,91,057 ఇండ్లకు ప్రతిపాదనలు ఇవ్వగా, ఇందులో లక్ష ఇండ్లు గ్రేటర్​ హైదరాబాద్ (జీహెచ్​ఎంసీ) పరిధిలోనివి. మిగతా 1,91,057 ఇండ్లు జిల్లాల్లో కట్టిస్తామని తెలిపింది. వీటికోసం లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్​ బెడ్రూం ఇండ్లు కేవలం 23 వేలు మాత్రమే. ఏండ్లకేండ్లు ఎదురుచూసి ఓపిక నశించి కొన్ని చోట్ల జనం డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్తున్నారు. కట్టిన ఇండ్లు కూడా ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని అధికారులను నిలదీస్తున్నారు. ఇండ్లలోకి వెళ్తున్న అర్హులను పోలీసుల సాయంతో అధికారులు బలవంతంగా బయటకు పంపించేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల ఎంపికను అధికారులు చేపట్టడం లేదు. దీనిపై అధికారులను సంప్రదిస్తే.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం లేదని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్​లోనే 6 లక్షలకు పైగా  అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసినపుడు రాష్ట్రంలో సొంతిల్లు లేనివాళ్లు 26.31 లక్షల మంది  ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఆసంఖ్య మరింత పెరిగింది. కాగా, జీహెచ్ ఎంసీ పరిధిలో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 56,066 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా..  3,313 ఇండ్లు మాత్రమే పంపిణీ చేసింది. పటాన్ చెరు సమీపంలోని కొల్లూరు దగ్గర  రూ. 1,408 కోట్లతో  120 ఎకరాల్లో 117 బ్లాక్ లలో 15,660 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఇయ్యలేదు.