మత్తులో మహా నగరం

మత్తులో మహా నగరం
  • మహారాష్ట్ర నుంచి పెరుగుతున్న సరఫరా
  • గతంలో గోవా.. ఇప్పుడు ముంబై
  • డ్రగ్​ఫెడ్లర్లు జైళ్లో ఉన్నా ఆగని దందా
  • పబ్​లు, స్టార్​ హోటళ్లలో విచ్చలవిడిగా విక్రయాలు
  • ఇంటర్​ కాలేజీలకూ పాకిన మత్తు దందా
  • గ్రామీణ ప్రాంతాలలో గంజాయి గుబాళింపు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజధాని ఉడ్ తా హైదరాబాద్ గా మారిపోతున్నది. నగరం డ్రగ్​ ఫ్రీ సిటీ అవుతుందనే ఆశలు చెరిగిపోతున్నాయి. మాదకద్రవ్యాల సరఫరాను, వినియోగాన్ని ప్రభుత్వం నిలువరిస్తున్నా మత్తు దందా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే డ్రగ్స్​బాధితులుగా గుర్తించిన ప్రముఖ వ్యాపారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారికి మందులు సప్లై చేసే వారిని కూడా పట్టుకున్నారు. హైదరాబాద్​ కేంద్రంగా డ్రగ్​ బిజినెస్​ నిర్వహించే ఫెడ్లర్లను పట్టుకుని జైళ్లో పడేశారు. కానీ, దందా మాత్రం ఆగడం లేదు. డ్రగ్​ ఫెడ్లర్లు నిర్మించిన సరఫరా సామ్రాజ్యం ఎక్కడికెక్కడికో పాకింది. దీంతో మత్తు దందా నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినా ఎక్కడా బ్రేక్​ పడటం లేదు. మొన్నటి వరకు సంపన్నవర్గాలకు మాత్రమే దొరికే డ్రగ్స్​ఇప్పుడు ఇంటర్​ కాలేజీల వరకూ చేరిపోయింది. 


హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారింది. గతంలో పోలీసుల కనుసన్నలలోనే డ్రగ్స్ మాఫియా నడుస్తోందనే విమర్శలు వచ్చాయి. వీఐపీ జోన్ బంజారాహిల్స్ లో ఠాణా పక్కనే ఉన్న హోటల్లో డ్రగ్​ పార్టీ నిర్వహించడం, 150 మంది ప్రముఖులు పట్టుబడటం తెలిసిందే. పోలీసుల సహకారంతోనే పబ్ లో తెల్లవారే వరకు హంగామా జరిగింది. పోలీసులు సపోర్టుతోనే యథేచ్చగా పబ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ పేరిట రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. సినీ పక్కీలో డ్రగ్స్‌ను నగరానికి చేర్చి అంగట్లో సరుకులాగా విక్రయిస్తున్నారు. ఐటీలో పని చేసేవారితో పాటుగా కాలేజీ అమ్మాయిలు డ్రగ్స్‌కి బానిసలు చేసి, మత్తులో వారిపై లైంగిక దాడులు చేస్తున్నారని తేలింది.
 
గతంలో గోవా, బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లుగా గుర్తించి ఆ మార్గాలపై కన్నేశారు. గోవా కేంద్రంగా డ్రగ్స్‌ సప్లై చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ ఎడ్విన్‌‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు. పలు రాష్ట్రాల పోలీసులకు ఎడ్విన్​ చుక్కలు చూపించారు. ఎట్టకేలకు హైదరాబాద్​ పోలీసులు జైలుకు పంపించారు. అంతలోనే మరో వ్యవహారం బయటకు వచ్చింది. గోవా, బెంగళూరు నుంచి సప్లై తగ్గినా, ఇప్పుడు ముంబై నుంచి రెట్టిపు స్థాయిలో డగ్ర్ వస్తున్నది. ఎడ్విన్‌ సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారంతా ముంబై గ్యాంగ్​ లోనూ ఉండటంతో డ్రగ్​ లింకులు ఎంత మేరకు ఉన్నాయనే విషయం తేలడం లేదు. ముంబై నుండి హైదరాబాద్‌కి డ్రగ్స్ సప్లై అవుతుందని గుర్తించిన తరువాత ఆపరేషన్ ముంబై పేరుతో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ఆపరేషన్​ చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందాకు హైదరాబాద్ లింకులు స్పష్టమయ్యాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఐటీ అధికారి సనాఖాన్ అనే 22 ఏళ్ల యువతి ముందుగా డ్రగ్​ ను సేవించే కస్టమర్​ గా ఉండగా, ఇప్పుడు సప్లయిర్​ వరకూ ఎదిగింది. సనాఖాన్​ ద్వారా ముంబై లింకులు బయటకువ చ్చాయి. ముంబైలో ఒక గ్రాము మూడు వేలకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌కి డ్రగ్స్ తెచ్చి ఒక గ్రాము ఏడు వేలకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. సనాఖాన్ లిస్టులో హైదరాబాద్‌కి చెందిన 40 మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు అమ్మకాలు చేస్తుందని తేలింది. ముంబైలో జతిన్ బాలచంద్ర భలేరా అనే వ్యక్తి ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. వీరంతా ఎండీఎంఏను విక్రయిస్తున్నట్లు తేల్చారు. గతంలో ఎక్కువుగా కొకైన్ పట్టుబడేది. కొకైన్‌పై అన్ని దర్యాప్తు సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో విదేశాల నుంచి వస్తున్నా కొకైన్‌ను కట్టడి చేశారు. ఇప్పుడు కొకైన్ కి బదులు ఎండీఎంఏ నిషేదిత డ్రగ్‌ను భారీగా సప్లై చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొకైన్‌తో పోలిస్తే ఎండీఎంఏ ఎక్కువ రేట్ పలుకుతుంది. దీంతో సప్లై ఎక్కువ ముంబై కేంద్రంగా నడుస్తున్నట్లు తేలింది. 

ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు
మలేషియా నుంచి నిషేధిత డ్రగ్స్‌ను హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఆ ముడి పదార్థాన్ని ఆస్ట్రేలియాకు సరఫరా చేసే ముఠా కూడా హైదరాబాద్​ లో చిక్కింది. ఈ ముఠా డ్రగ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పుణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్, ఫైజాన్ లను అరెస్ట్ చేసి, ఇద్దరి నుంచి 50 లక్షలు విలువైన 500 గ్రాముల సూడోఎఫిడ్రిన్ సీజ్ చేశారు. ఈ ముడి పదార్థానికి ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ డ్రగ్స్‌కి బాగా గిరాకీ ఉందని తేలింది. ఇలా డ్రగ్​ వినియోగానికి, రవాణాకు హైదరాబాద్​ ప్రత్యేక స్థానంగా నిలుస్తున్నది. 

చేస్తున్నదెవ్వరు?
వాస్తవానికి డ్రగ్​ ఫెడ్లర్లను పోలీసులు పట్టుకుంటున్నారు. జైళ్లో పెడుతున్నారు. కానీ, అంతకు మించిన స్థాయిలో మళ్లీ సప్లై జరుగుతూనే ఉంది. పబ్​లు, స్టార్​ హోటళ్లతో పాటుగా యూనివర్సిటీలు, కాలేజీల్లో సైతం తేలిగ్గా దొరుకుతున్నది. దీంతో అసలు డ్రగ్​ సరఫరా ఎవరు చేస్తున్నారు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు లింకులున్నాయా అనే విషయాలు మాత్రం తేలడం లేదు. దీనిపై పోలీసులకు కొంత లీకులు వచ్చినా.. ఎందుకో విచారణ మాత్రం మధ్యలోనే ఆగిపోతున్నది. ఫలితంగా డ్రగ్​ సప్లై నిరంతరం జరుగుతూనే ఉంది. 

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి
హైదరాబాద్​ మహా నగరాన్ని ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్​ వంటి డ్రగ్స్​ చుట్టుముడుతుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గంజాయి దొరుకుతున్నది. ఏపీతో పాటుగా పలు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువస్తున్నారు. జిల్లాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ, గంజాయిని కూడా కట్టడి చేయలేకపోతున్నారు. 

మధ్య తరగతిలో భయం
ప్రస్తుతం డ్రగ్​ కల్చర్​ పబ్​లు, హోటళ్లు, విద్యా సంస్థలకు పాకడంతో మధ్య తరగతి వర్గాలు వణుకుతున్నాయి. ప్రధానంగా టీనేజ్​ అమ్మాయిలు, ఇంటర్​ స్థాయి నుంచే విద్యార్థినిలకు డ్రగ్​ అలవాటు చేసి, లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తేలింది. లైంగిక దాడికి పాల్పడుతూ వీడియోలు కూడా చిత్రీకరిస్తుండటంతో మధ్య తరగతి వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ముంబై ముఠా ఇలాంటి ఘటనలకే పాల్పడుతుందని పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ లో ఈ ముఠా ఎక్కడెక్కడ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిందనే అనుమానాలు వేధిస్తున్నాయి.