34 మంది ఎమ్మెల్యేల చేతివాటం

34 మంది ఎమ్మెల్యేల చేతివాటం
  • ‘దళితబంధు’లో కమీషన్ల పర్వం
  • ఆరుగురు శాసనసభ్యులు నేరుగా 
  • నాలుగు చోట్ల వారి తనయులతో
  • మిగిలినవారు అనుచరులతో  వసూలు 
  • మరో 42 మంది మీద ఆరోపణలు
  • ముగ్గురు మంత్రుల పేరుతోనూ దందా
  • సీఎం ఆదేశంతో నిఘా అధికారుల ఆరా
  • సంచలన నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్​

‘ఇందుగలదందు లేదు’ అన్నట్టుగా అవినీతి కోరలు చాస్తోంది. ప్రజా సంక్షేమం కోసం పథకాలు రూపొందించాల్సిన కొందరు ప్రజా ప్రతినిధులు ఆ పథకాల నుంచే కమీషన్లు దండుకుంటున్నారు. పేదల కోసం సర్కారు చేస్తున్న సాయంలోనూ చేతులు చాపుతున్నారు. బడుగుల బతుకులు బాగు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోనూ అక్రమాలు సాగుతున్నాయనే ఫిర్యాదులు భారీగా రావడంతో నిఘా అధికారులను రంగంలోకి దించి సీఎం కేసీఆర్ రహస్య పరిశీలన చేయించారు. లబ్ధిదారుల నుంచి నేరుగా వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదికను అందజేశారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.


ముద్ర, తెలంగాణ బ్యూరో :
దళితబంధులో కొందరు ఎమ్మెల్యేల వసూళ్ల దందాపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందింది. దళితబంధు లబ్ధిదారుల నుంచి వారు రూ. రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లుగా రూఢీ అయింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే ఈ దందా చేయగా, మరికొన్ని సెగ్మెంట్లలో ఎమ్మెల్యేల పేరు చెప్పి అనుచరులు వసూళ్లు చేశారు. ఏకంగా ముగ్గురు మంత్రుల పేరుతోనూ ఈ దందా చేశారు. దళితబంధులో వసూళ్ల పర్వంపై ఫిర్యాదులు ఎక్కువగా రావడం, ఆరోపణలు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్​ దీనిపై క్షేత్రస్థాయి విచారణకు పురమాయించారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. ఇంటెలిజెన్స్ అధికారులు సర్వే నివేదికను సీఎం కేసీఆర్​ కు అందించారు. ఈ నివేదిక ఆధారంగా 34 మంది ఎమ్మెల్యేలు దళితబంధు లబ్ధిదారుల నుంచి రెండు లక్షల చొప్పున వసూళ్లు చేసినట్లుగా తేలింది. వీరిలో ఆరుగురు నేరుగా , అంటే లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇంకో 28 మంది ఎమ్మెల్యేలు మాత్రం మధ్యవర్తుల ద్వారా కమీషన్లు తీసుకున్నట్లు తేలింది. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలోనూ దళితబంధు పథకంలో వసూళ్ల పర్వం కొనసాగింది. నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉన్న నియోజకవర్గాలలో ఇన్చార్జీలు వసూళ్లకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిలో భాగంగానే ఇటీవల ఓ సెగ్మెంట్ లో ఇన్చార్జీకి కాకుండా మరో నేతకు టికెట్ ఇస్తామని మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ సెగ్మెంట్ లో ఎక్కువ స్థాయిలో లబ్ధిదారుల నుంచి ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న నాయకుడి పేరుతో కొంతమంది నుంచి రూ. 2లక్షల చొప్పున వసూళ్లు చేశారని, వీటిని స్థానిక నేతలతో కలిసి పంచుకున్నారనే ఆరోపణలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్​ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట వసూళ్లు ఆగలేదని, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చారని క్షేత్రస్థాయి ఎంక్వయిరీలో వెల్లడైంది. 

ఎమ్మెల్యేల పేరుతోనూ వసూళ్లు
34 మంది ఎమ్మెల్యేలకు దళిత బంధు వసూళ్లతో లింకులు ఉండగా, మరో 42 నియోజకవర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేల పేరు చెప్పి లబ్ధిదారుల నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. ఇక్కడ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేల అనుచరులు వసూలు చేశారు. అయితే, ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం లేదని నిఘా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా, ముగ్గురు మంత్రుల పేరుతోనూ దళితబంధులో కమీషన్లు వసూలు చేశారు. ఈ మంత్రులకు ఎంత మేరకు ప్రమేయం ఉందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేలకు వారసులకు కూడా దళిత బంధు లబ్ధిదారులు కమీషన్లు ఇచ్చారు. కొన్నిచోట్ల తమకు పథకం వచ్చేలా చూడమంటూ ముందుగానే ముట్టజెప్పారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, నిజామాబాద్​ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్​ జిల్లాలో మరో ఎమ్మెల్యే తరుపున వారసులు వసూళ్లకు పాల్పడినట్లు ఇంటలీజెన్సీ సర్వేలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. 

సీఎం సీరియస్​
సీఎం కేసీఆర్​ దాదాపు రెండు నెలల పాటు ఈ వివరాలను సేకరించారు. నియోజకవర్గాలవారీగా లబ్ధిదారుల నుంచి వివరాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల కాలంలో సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేసే స్కీం కూడా అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాల్లో వసూళ్ల పర్వంపై కూపీ లాగుతున్నారు. దీనిలో ఏకంగా 34 మంది ఎమ్మెల్యేలు వసూలు చేసినట్లుగా తేలింది. ఈ వివరాలు సేకరించినట్లుగా సదరు ఎమ్మెల్యేలకు కూడా తెలిసింది. తమ పేర్లు బయటకు వచ్చాయనే భయం నెలకొన్నది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్లు రావంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు వసూళ్లు వారి మెడకు ఉచ్చు బిగించినట్లుగా మారింది. ఇలాంటి వాటిని సాకుగా చూపిస్తూ ఈసారి టికెట్​ నిరాకరిస్తారనే భయం ఇప్పుడు వెంటాడుతున్నది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్​ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. తాజాగా ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, కరీంనగర్​ జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గ ఇన్చార్జీకి సీఎం కేసీఆర్​ నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు ప్రగతిభవన్​ లో టాక్​ వినిపిస్తున్నది.