భయమెందుకు? | Mudra News

భయమెందుకు? | Mudra News
  • అదానీ కుంభకోణాల మీద జేపీసీ ఎందుకు వేయరు!
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  • ఆర్బీఐ ఎదుట ధర్నా
 
ముద్ర, తెలంగాణ బ్యూరో : అదానీ కుంభకోణాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోడీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ప్రశ్నించారు. అదానీ కుంభకోణాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని వేయాలని, తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు సోమవారం సీపీఐ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అదానీ ఆర్థిక సామ్రాజ్యం గాలిబుడగ లాంటిదని, అవినీతి పునాదులపైన నిర్మించిన సామ్రాజ్యమని విమర్శించారు. హిండెన్ బ‌ర్గ్‌ విడుదల చేసిన నివేదిక తదుపరి, అదానీ అవినీతి సంపాదన గుట్టురట్టు అయ్యిందని, నరేంద్రమోడీ కనుసన్నలలోనే ఎల్‌ఐసీ నుంచి రూ. 80 వేల కోట్లు, ఎస్‌బీఐ నుంచి రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు అదానీ కంపెనీలలో పెట్టారన్నారు. ప్రజల సొమ్మును అదానీ కంపెనీలో ఎలా పెట్టుబడులు పెడతారని, ఇప్పుడు నష్టపోయిన సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను క్ర‌మంగా తగ్గిస్తున్నారని, ఆహారం మీద రూ. 1 లక్ష కోట్లు తగ్గించారని, ఎరువులపైన రూ. 50 వేల కోట్లు ఆ విధంగా మొత్తం సబ్సిడీలను ఇప్పుడు రూ. 3 లక్షల కోట్లకు తగ్గించారని కూనంనేని ధ్వజమెత్తారు.
సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాక ముందు అదానీ ఎవరో సమాజానికి తెలియద‌న్నారు. మోడీ అండదండలతో ప్రపంచ కుబేరులలో అదానీ స్థానం పొందారని అన్నారు. దేశంలోని సహజ వనరులను కొల్లగొట్టి అదానీ లాంటి కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెపుతున్నారని, ధనవంతుడు మరింత ధనవంతుడుగా అవుతున్నారని అన్నారు. పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడ‌ని ఆరోపించారు. మోడీ విధానాల వలన బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ. 30 వేల కోట్లు కోత విధించారని, ప్రజలకు ఇచ్చే సొమ్ముపై కోతలు విధించి, కార్పోరేట్‌ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.