టీ20 ప్ర‌పంచ క‌ప్ లో సంచ‌ల‌నం.. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో సంచ‌ల‌నం.. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. అస్ట్రేలియాను ఇంటికి పంపి తొలిసారిగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా తరఫున లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) గొప్పగా పోరాడాడు. గురువారం ఉదయం సౌతాఫ్రికాతో అఫ్గాన్ సెమీఫైనల్ ఆడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రషీద్ ఖాన్ (19 నాటౌట్; 10 బంతుల్లో, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్లతో సత్తాచాటాడు. ముస్తాఫిజుర్ (1/17), తస్కిన్ అహ్మద్ (1/12) చెరో వికెట్‌తో అఫ్గాన్ స్కోరును కట్టడి చేశారు.

అయితే ఓ దశలో అఫ్గాన్ 10 ఓవర్లకు 58/0 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అఫ్గాన్ సునాయాసంగా 140 పరుగులు సాధిస్తుందనేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. అంతేగాక అఫ్గాన్ బ్యాటర్లు నిదానంగా ఆడటంతో 19 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 100/5 మాత్రమే. అయితే తన్జీమ్ హసన్ వేసిన ఆఖరి ఓవర్‌లో రషీద్ ఖాన్ రెండు సిక్సర్లు బాది జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. అయితే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో బంగ్లా ఛేజింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 12.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించి సెమీస్‌కు చేరుదామనుకున్న బంగ్లాదేశ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నవీనుల్ వేసిన తొలి ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో ఓపెనర్ తన్జీద్ హసమ్‌ను ఫజల్లా ఫరూకీ డకౌట్ చేసి బంగ్లాను తొలి దెబ్బ కొట్టాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో నవీనుల్ చెలరేగి వరుస బంతుల్లో కెప్టెన్ షాంటో (5; 5 బంతుల్లో, 1 ఫోర్), షకిబ్ అల్ హసన్ (డకౌట్)ను పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే వర్షం పడటంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత లిటన్ దాస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ పవర్‌ప్లేలో 46 పరుగులు చేసింది. కాగా, రషీద్ ఖాన్ ఎంట్రీతో అఫ్గానిస్థాన్ తిరిగి పోటీలోకి వచ్చింది.

రషీద్ తన ఓవర్‌లో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో బంగ్లా 11 ఓవర్లకు 80/7తో కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత మరోసారి వర్షం పడటంతో బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లకు 114 పరుగులుగా కుదించారు. లిటన్ దాస్- అఫ్గాన్ బౌలర్ల పోరాటంతో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. కానీ నవీనుల్ 19వ ఓవర్‌లో వరుస వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.