మీడియాపై ఆగ్రహం

మీడియాపై ఆగ్రహం
  • ప్రశ్నలడగవద్దన్న రోహిత్​

పల్లెకెలె: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశాడు. బయటి విషయాలను ప్రస్తావిస్తూ తనను ప్రశ్నలు అడగొద్దని సూచించాడు. వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో బయటి వ్యక్తుల కామెంట్ల గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నలు అడిగితే తాను సమాధానం చెప్పబోనని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రోహిత్, అగార్కర్ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ప్రపంచకప్ జట్టు విషయంలో మాజీ ఆటగాళ్ల సూచనలను మీడియా ప్రతినిధులు రోహిత్ ముందు ప్రస్తావించగా అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మా లక్ష్యం ప్రపంచకప్ గెలవడం. మా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. మళ్లీ బయటి వ్యక్తుల విమర్శలను నా ముందు ప్రస్తావించరని ఆశిస్తున్నా అని అన్నాడు. ముఖ్యంగా ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రెస్‌మీట్లలో ఇలాంటి ప్రశ్నలు అడగరనుకుంటున్నా. ఒకవేళ అడిగినా నేను వాటికి సమాధానాలు చెప్పను. మేమంతా ప్రోఫెషనల్ ఆటగాళ్లం. బయటి వ్యక్తుల విషయాలు మాకు అనవసరం. జట్టు విజయం కోసం ఏం చేయాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు.'అని రోహిత్ కోపగించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక గత 10 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదనే ఒత్తిడి తమపై ఏ మాత్రం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కేవలం తమ సామర్థ్యాలకు తగ్గట్లు రాణించడంపైనే ఫోకస్ పెట్టామని తెలిపాడు. జట్టులో చోటు దక్కని ఆటగాళ్లు ఎవరూ కూడా నిరాశకు గురికావద్దని రోహిత్ సూచించాడు. తదుపరి అవకాశం కోసం ప్రయత్నించాలని కోరాడు. హార్దిక్ పాండ్యా టీమిండియాకు సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ అని, ప్రపంచకప్‌లో అతని ఫామ్ తమకు కీలకమని చెప్పుకొచ్చాడు. 'ప్రతీ మ్యాచ్‌కు జట్టులోని ఆటగాళ్లంతా పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండటం నాకు కావాలి. అప్పుడు ప్రత్యర్థి జట్టుకు తగ్గట్లు తుది జట్టులో ఎవర్నీ తీసుకోవాలో నిర్ణయిస్తాం. క్వాలిటీ ఆటగాళ్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టమే. ప్రత్యర్థి జట్లలోని ఆటగాళ్లలో ఎవరు ఫామ్‌లో ఉన్నారనే విషయం తెలుసుకోవాలి. అందుకు తగ్గట్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకోవాలి. మేం మంచి కాంబినేషన్‌ను ఎంచుకున్నాం. బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది. క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. నలుగురు పేస్ బౌలర్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఇద్దరూ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఆ రోజు మ్యాచ్ పరిస్థితులు.. ప్రత్యర్థి జట్టును బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.