చెలరేగిన పృథ్వీ షా.. చేతులెత్తేసిన సూరీడు!

చెలరేగిన పృథ్వీ షా.. చేతులెత్తేసిన సూరీడు!


బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్.. ప్రియాంక్ పాంచల్ కెప్టెన్సీలోని వెస్ట్ జోన్ హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి 39 ఓవర్లలో 5 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసింది. పృథ్వీ షా (101 బంతుల్లో 9 ఫోర్లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్(11), కీపర్ హర్విక్ దేశాయ్(21), సూర్యకుమార్ యాదవ్(8), సర్ఫరాజ్ ఖాన్(0) దారుణంగా విఫలమయ్యారు.

క్రీజులో చతేశ్వర్ పుజారా(8 బ్యాటంగ్), అతిత్ షేత్(4 బ్యాటింగ్) ఉన్నారు. వెస్ట్ జోన్ ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకు ముందు 182/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌత్ జోన్.. వాషింగ్టన్ సుందర్(22 నాటౌట్) రాణించడంతో 213 పరుగులు చేయగలిగింది. విజయ్ కుమార్ వైశాఖ్(13), విద్వత్ కావేరప్ప(8), వాసుకి కౌశిక్‌ల సాయంతో సుందర్ జట్టు స్కోర్‌ను 200 మార్క్ ధాటించాడు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సౌత్ జోన్‌ను హనుమ విహారి(130బంతుల్లో 9 ఫోర్లతో 63), తిలక్ వర్మ(87 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40)ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించిన అనంతరం తిలక్ వర్మ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. హనుమ విహారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు వెస్ట్ జోన్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో విహారి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక విహారికి ఇది 46వ ఫస్ట్ క్లాస్ హాఫ్ సెంచరీ. ఇక 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన వెస్ట్ జోన్.. పుజారాపైనే ఆశలు పెట్టుకుంది. అతను రాణిస్తేనే మ్యాచ్‌లో నిలవనుంది. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్ కావేరప్ప(3/40) మూడు వికెట్లు తీయగా.. వాసుకి కౌశిక్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో వికెట్ తీసారు.