అప్పుల కుప్పలు | Mudra News

అప్పుల కుప్పలు | Mudra News
  • 8 లక్షల కోట్లు దాటిన తెలుగు రాష్ట్రాల రుణాలు
  • తెలంగాణ రూ. 4.33 లక్షల కోట్లు
  • ఆంధ్రప్రదేశ్  రూ. 4.42 లక్షల కోట్లు
  • పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం
  • యేటేటా విపరీతంగా పెరుగుతున్న వడ్డీ
  • రూ. 20 వేల కోట్లు కేవలం మిత్తీల కిందకే

తెలంగాణ ఆవిర్భావం తర్వాత  చేసిన అప్పులు 

2014-–15లో రూ. 8,121 కోట్లు
2015-–16లో రూ. 15,515 కోట్లు
2016–17లో రూ. 30,319 కోట్లు
2017-–18లో రూ. 22,658 కోట్లు
2018-–19లో రూ. 23,091 కోట్లు
2019-‌‌–20లో రూ. 30,577 కోట్లు
2020-–21లో రూ. 38,161 కోట్లు
2021–22లో రూ. 39,433 కోట్లు

యేటా రాష్ట్ర సర్కార్​ కట్టిన వడ్డి ( రూ. కోట్లలో)

2014–-15       5,195 
2015-–-16    6,755
2016-–-17    7,995 
2017-–-18    10,262
2018-–-19    11, 892
2019-–-20    13,642
2020-–-21    16,010
2021-–- 22    18,688
2022-–- 23    18,980 (జనవరి వరకు)


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాలు అప్పులతోనే నడుస్తున్నాయి. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అప్పులలో మాత్రం పోటీ పడుతున్నాయి. రాష్ట్రాల అప్పుల గురించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.75,577 కోట్లు ఉండగా, 2021–-22 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 2.83 లక్షల కోట్లకు పెరిగాయని, 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులు యేటా పెరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. అవిర్భావ సమయంలో అతి తక్కువ అప్పులతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేసిందని పార్లమెంట్​ సాక్షిగా వెల్లడైంది. ఎలాంటి స్కీంలు ప్రవేశపెట్టినా అప్పులపైనే ఆధారపడుతున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలంగాణ అప్పుల చిట్టాను వివరించారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ. 1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. 

మిత్తీలకే వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుండటంతో వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. యేటేటా మిత్తీలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిదిన్నరేండ్లలో కేవలం వడ్డీలకే లక్ష కోట్లను సర్కారు చెల్లించింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014–15లో ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వడ్డీ కట్టింది. ఇప్పుడు అది నాలుగింతలకు చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022–23) వడ్డీల భారం రూ. 21 వేల కోట్లకు చేరింది. 2016–17లో రూ.8 వేల కోట్ల వడ్డీలు కడితే.. అదే 2021–22 లో రూ.18,688 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం ఈ మొత్తం మరింత పెరగనుంది.

ఒక్కొక్కరిపై రూ.లక్ష దాటిన అప్పు  
సర్కార్ తీసుకునే అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతున్నది. ఇప్పటి దాకా రాష్ట్రం చేసిన​ అప్పులు రూ. 4.33 లక్షల కోట్లు కావడంతో ఒక్కొక్కరిపై లక్షన్నర వరకు అప్పు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై అప్పు రూ.1.28 లక్షల  నుంచి రూ. 1.40 లక్షలకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ, ఇతర రుణ సంస్థల నుంచి ఎఫ్​ఆర్​బీఎం పరిమితిలో తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికి రూ. 3,1 లక్షల కోట్లుగా ఉండగా, గ్యారంటీల పేరుతో కొత్త కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న మొత్తం రూ.1.30 లక్షల కోట్లు. ఇవన్నీ కలిపితే రూ.4.33 లక్షల కోట్లకు చేరింది. 

ఏపీ కూడా అంతే
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోను అప్పులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థికశాఖ మరోసారి బయటపెట్టింది. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు పెరిగిన అప్పుల వివరాలను వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో రూ. 2,64, 451 కోట్లు ఉన్న ఏపీ అప్పులు... 2020 కి రూ. 3,07, 671 కోట్లకు పెరిగాయి. 2021లో రూ. 3,53,021 కోట్లకు చేరాయి. 2022 నాటికి రూ. 3,93,718 కోట్లకు ఎగసిన ఆంధ్రప్రదేశ్ అప్పులు 2023 ప్రకారం రూ. 4,42,442 కోట్లకు చేరాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా సుమారు రూ. 45 వేల కోట్ల అప్పులు చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అవి కూడా ఎక్కువే
ఈ అప్పులే కాకుండా తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించాయని మంత్రి తెలిపారు. నాబార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పు రూ. 1,50,365.60 కోట్లకు చేరినట్లు వివరించారు. 12 బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు.. రూ.1,30,365.60 కోట్లకు చేరినట్లు చెప్పారు. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశామనన్నారు. రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా... రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వివరాలు వెల్లడించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫండ్‌ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు చేయగా.. రూ. 10 కోట్లు విడుదల అయినట్లు తెలిపింది. నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా  తెలంగాణ ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వాడుకున్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి వివరాలు వెల్లడించారు.
ఇలా మొత్తం తెలంగాణ అప్పులు రూ. 4,33,817 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.