కమ్యూ‘నిష్ట’మేది?! | Mudra News

కమ్యూ‘నిష్ట’మేది?! | Mudra News
  • లీడర్​ బీఆర్ఎస్..కేడర్​ కాంగ్రెస్​
  • రేవంత్​ పాదయాత్రలో సీపీఐ నేతలు
  • గతంలో భట్టి వెంట నడిచిన వామపక్షాలు
  • తాజాగా కాంగ్రెస్​ జెండాలతో కలిసి అడుగులు
  • కేసీఆర్​ దోస్తానాపై కిందిస్థాయిలో ఆగ్రహం
  • బీజేపీకి యాంటీగా ఎగువ స్థాయి నేతల జట్టు
  • బీఆర్ఎస్​ ఖమ్మం సభలోనూ కనిపించని ఎర్ర జెండాలు

మతోన్మాద విధానాలతో పాలన సాగిస్తున్న బీజేపీని నిలువరించడానికి అవసరం అయితే కలిసి వచ్చే స్థానిక పార్టీలతో జట్టు కట్టాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖలకు సూచించింది. దీంతో ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు పార్టీల నేతలు బీఆర్ఎస్ తో సన్నిహితంగా మెదులుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత శాసనభలో కమ్యూనిస్టు పార్టీలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇది కూడా అధికార పార్టీతో కలిసిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు కొనసాగించుకుంటూ, తమ ఉనికిని చాటుకుంటూనే గులాబీ దళంతో కలిసి పని చేయాలని వారు భావిస్తున్నారు. కానీ, కేడర్ మాత్రం బీఆర్ఎస్ కు దూరంగా ఉంటోంది. తాజాగా రేవంత్ పాదయాత్రలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఇది దేనికి సంకేతం?!   


తెలంగాణ ఏర్పడిన తరువాత ఉభయ కమ్యూనిస్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే వామపక్షాలలో  లీడర్​, కేడర్ విడిపోతున్నదా?​నేతలు బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తుంటే, కేడర్​ మాత్రం కాంగ్రెస్​తో కలిసి అడుగులేస్తున్నది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో  హాట్ టాపిక్​ గా మారుతున్నాయి. కమ్యూనిస్టులను ఇప్పుడిప్పుడే దగ్గర చేసుకుంటున్న బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు షాక్​ ఇస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో స్థానిక నేతలు, కార్యకర్తలు కలిసి నడుస్తున్నారు. అక్కడక్కడా కాంగ్రెస్​ జెండాలతో సమానంగా ఎర్రజెండాలు ఎగరడం కనిపిస్తున్నది. దీనికితోడుగా ఇటీవల ఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్​తొలి బహిరంగ సభలోనూ కమ్యూనిస్టు శ్రేణులు కలిసి రాలేదు. సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వచ్చి ప్రసంగం చేసినా కనీసం జై కొట్టలేదు. ఒక్కచోట కూడా ఎర్రజెండాను ప్రదర్శించలేదు. దీంతో కిందిస్థాయిలో బీఆర్ఎస్ తో దోస్తానాకు శ్రేణులు ఇష్టపడటం లేదని భావించాల్సి వస్తున్నది. 

మునుగోడు నుంచే మొదలు
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ కు కమ్యూనిస్టులను దగ్గర చేసింది. అక్కడ ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రగతిభవన్ దారులు తెరిచారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న నేతలకు సీఎం నుంచి పిలుపు రావడంతో  కొత్త ఊపు వచ్చింది. వచ్చే ఎన్నికలకు ఎలాంటి హామీలు లేకుండానే వెళ్లి కేసీఆర్​ కలిశారు. దీంతో మునుగోడులో కనీసం 40వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆశించారు. కానీ, ఇక్కడ కేసీఆర్​ ఆశించినట్లుగా కలిసి రాలేదు. కమ్యూనిస్టు లీడర్లు బీఆర్ఎస్​తో చెట్టాపట్టాలేసుకున్నా, కిందిస్థాయి కేడర్​ మాత్రం అంటీముట్టనట్టుగానే ఉంది. ప్రచారానికి దూరమైంది. కొంతమంది మండలస్థాయి లీడర్లు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చారనే మటలు కూడా వినిపించాయి. ఫలితంగా బీఆర్ఎస్​ అభ్యర్థికి మెజార్టీ తగ్గిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా వామపక్షాలతో దోస్తీ కొనసాగుతూనే ఉంది. పలు సందర్భాలలో కేసీఆర్ ను ఎత్తుకుంటూనే ఉన్నారు. బడ్జెట్​ సందర్భంగా కూడా సమర్థించారు.

బీజేపీ బూచీ నచ్చట్లే
కమ్యూనిస్టు లీడర్లు కేసీఆర్​ వెంట నడుస్తున్నా కేడర్​ మాత్రం దూరంగానే ఉంటున్నదని అంటున్నారు. కొన్నిచోట్ల డబుల్​ బెడ్​ రూం ఇండ్ల కోసం జరుగుతున్న ఆందోళనలకు వారు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ భూములలో గుడిసెలు వేయిస్తున్నారు. రాష్ట్రస్థాయి నాయకత్వం మందలించినా కిందిస్థాయిలో మాత్రం వినడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్​ తొలి బహిరంగ సభలో కమ్యూనిస్టు జెండాలు ప్రదర్శించి, నినాదాలు ఇవ్వాలని అధిష్టానం సూచించింది. కానీ, ఎవ్వరూ స్పందించలేదు. బీజేపీని బూచిగా చూపించి బీఆర్ఎస్‌తో ప‌ని చేయాలంటే కష్టంగా ఉందని కేడర్​ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పదేండ్ల కేసీఆర్​ పాలనలో చాలా సమస్యలు ఉన్నాయని, గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలలోనూ బీఆర్​ఎస్​ నేతలు దోచుకుంటున్నారని వామపక్షాల స్థానిక నేతులు  విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారితో కలిసి జై కొట్టడానికి వారు సంశయిస్తున్నారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని రాష్ట్ర నాయ‌క‌త్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా మొదలైంది. వారిని అసెంబ్లీలో కంటే, మండలిలో  కూర్చుండబెట్టేందుకు కేసీఆర్​ వ్యూహాలు వేస్తూనే ఉన్నారు.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా
కమ్యూనిస్టు కార్యకర్తలు ఇప్పుడు పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తున్నారు. బీఆర్ఎస్ తో​ కాకుండా కాంగ్రెస్ తో జట్టు కడుతున్నారు. ‘హాత్​ సే హాత్​ జోడో అభియాన్’ లో భాగంగా పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి వెంట నడుస్తున్నారు. రేవంత్​ సభలలో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలో జరిగిన రేవంత్ పాదయాత్రలో కమ్యూనిస్టులు జెండాలతో వచ్చి, కండువాలు కప్పుకుని వెంట నడిచారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని, కలిసి వచ్చే చోట ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని జాతీయ నాయకత్వం సూచించింది. రాష్ట్రంలో మాత్రం బీఆర్​ఎస్​ తో కలువడం కేడర్​ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నా  పట్టించుకోవడం లేదంటున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు కాంగ్రెస్ తో కలుస్తున్నారు. పార్టీ  నిర్ణయం తమకు నచ్చడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో సీపీఐ, ఏఐటీయూసీ నేతలు రేవంత్​ వెంట నడిచారు. రేవంత్ పాదయాత్రలో పాదం కలిపారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు కొత్త దారిని చూపుతున్నాయి.