అంతరాలను మాపి ఐక్యతను నిలిపేది 'ఊరు కట్టు' ఆధునిక కాలంలో పెరుగుతున్న 'కొలుపు'ల నిష్ట

అంతరాలను మాపి ఐక్యతను నిలిపేది 'ఊరు కట్టు'  ఆధునిక కాలంలో పెరుగుతున్న 'కొలుపు'ల నిష్ట

మహాదేవపూర్, ముద్ర: ఊరు కొలుపులు ఈ ఆధునిక సమాజంలో కూడా ఊరు ఊరున ఘనంగా సాగుతున్నాయి. ఊరుకొలుపులో కుల, మత, వర్గాల భేదం లేకుండా అందరూ పాల్గొంటారు. ఊరు కట్టులో మాదిగలది ప్రధాన భూమిక, డుబ్బుల వారు, పంబాలవారు, చాకలి, మంగలి, కుమ్మరి, పంచ వృత్తుల వారు అనేక సందర్భాలలో వారి శక్తి యుక్తులను ధారపోస్తారు. పంబాలవారు పట్నాలు వేసి బలులను సమర్పించి ఊరు కట్టులో ప్రధాన భూమికను పోషిస్తారు. మిగతా కులాల వారు గొల్ల, కురుమ, కాపు, ముదిరాజ్, వైశ్య, బ్రాహ్మణ లాంటి అనేక కులాల వారు యధాశక్తి తమ కానుకలను ఉరుకట్టులో సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో కులాల మధ్య అంతరాలు కానరాకుండా పోతాయి. ఊరు చుట్టూ గటుక పిండి, బూడిదలతో పాటు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు లాంటి వస్తువులతో కట్టు పోస్తారు. కోళ్లు, కోడి గుడ్ల సమర్పించుకుంటూ కట్టును కొనసాగిస్తారు. గ్రామంలోని పెళ్లి పోచమ్మ, మదన పోచమ్మ, కట్ట మైసమ్మ లాంటి అనేక గ్రామదేవతలకు ఏట పిల్లలతో బలులు సమర్పిస్తారు. ప్రత్యేకంగా సదరు పిల్లగా పిలిచే జంతువును కూడా బలి ఇస్తారు. అనేక గ్రామదేవతలను లెల్లాయి పాటలతో ఆహ్వానించి ఆవాహన చేస్తారు.

ఇది సామాన్యుల యొక్క అసామాన్య పండుగగా చెప్పుకోవచ్చు. ఈ కట్టు తర్వాత ఊర్లో ఎటువంటి మూఢనమ్మకాలకు భయపడాల్సిన పని లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామస్తులు అంత ఏకస్తులై ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ఈ కట్టు పూర్వకాలం నుండి అమల్లో ఉంది. అనేక ఇన్ఫెక్షన్లు ఇతర క్రిమి కీటకాలు గ్రామంలోకి రాకుండా కట్టు వద్దనే ఉండిపోతాయని శాస్త్రీయ దృక్పథం కలవారు పేర్కొంటున్నారు. రక్తానికి, బలులను ఆశించి బ్యాక్టీరియా, క్రిమి కీటకాలు మొత్తం ఊరి కట్టు లోనే నివాసం ఏర్పరచుకొని అక్కడే నశించిపోతాయి. ఇలాంటి దూరదృష్టి కలిగి గాలి ధూళిగా పేర్కొనే ఇన్ఫెక్షన్లు, అవుటు బ్రేక్, కంటామినేషన్లు నిరోధించి ప్రజల యోగ క్షేమాలను కాంక్షించి చేసే మైసమ్మ కొలుపులో శాస్త్రీయ దృక్పథం ఉంటుందని పలువురు భావిస్తారు. మరొక రకంగా సామాజికంగా గ్రామంలో అన్ని కులాల మధ్య సామరస్యత ఏర్పడి ఊరు ఊరంతా కలిసి పని చేస్తూ ఒకే బాట ఒకే మాటగా జట్టుగా పూరి ఐక్యతను చాటి చెబుతుంది. ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అందరూ కలిసి ఐకమత్యంగా చేరుకోవడం ఊరు కట్టు యొక్క గొప్పతనంగా చెప్పాలి. ప్రధాన దేవత మైసమ్మకు. రంగులతో పెద్దపెద్ద పట్నాలు వేసి మొక్కుబడులు చెల్లించి దున్నపోతు బలి ఇస్తారు. రక్తం చీరతో దున్నపోతు తలను శిరస్సును దాల్చి ఊరు తిరగటం ఊరు కట్టులో ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. దీనిని మాదిగ కులస్తులే నిర్వహిస్తారు. వందల కొద్ది జీవాలను గ్రామ దేవతలకు బలివ్వటం, గావు పట్టి గ్రామదేవతలను లెల్లె పాటలతో, పంబాల, దుబ్బుల డబ్బులతో శాంతింపజేయటం మొక్కలు నిర్వహించే వారికి ఉత్సాహంగా, కొత్త తరానికి అద్భుతంగా, మూఢ నమ్మకాలు కలిగిన వారికి భయానకంగా, బలులను ఆచరించని వారికి బీభత్సంగా, మైసమ్మ పోచమ్మ పూనకాలు గల వారితో రౌద్ర రూపంలో కొలుపుల ఘట్టాలు సాగుతాయి. మహాదేవపూర్ గ్రామంలో ఈనెల ఒకటి రెండున ఊరు కొలుపు కార్యక్రమం కార్యక్రమాన్ని ఘనంగా జరగనున్నది. ఈ కార్యక్రమం జరిగేంతవరకు గ్రామంలోకి ఆర్టీసీ మొదలు ఇతర వాహనాలు మరియు మనుషుల రాకపోకలను నాదే ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు నిలిపివేయనున్నారు. శనివారం నాడు గ్రామ దేవతలను మదన పోచమ్మ పెళ్లి పోచమ్మ కట్ట మైసమ్మ నల్లగొండ పోచమ్మ లాంటి 16 గ్రామ దేవతలకు బలి కార్యక్రమాలను వేట పిల్లలతో నిర్వహించనున్నారు. ఊరు కట్టు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి పట్టణాల నుంచి బంధువులు గ్రామానికి తరలివస్తున్నారు. ఎలికేశ్వరం, అన్నారం, సూరారం అంబటి పెళ్లి తదితర గ్రామాలలో ఊరుకట్టు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి గ్రామ ప్రజలు ఏర్పాట్లలో తల మునకలవుతున్నారు. ఆధునిక కాలంలో కూడా ఊరు దేవతల పట్ల, సాంప్రదాయాల పట్ల ప్రజలలో విస్తృతమవుతున్న భక్తిశ్రద్ధలకు ఊరుకట్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.