ఏం చేద్దాం?

ఏం చేద్దాం?
  • జిల్లాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా!
  • పర్యటన వివరాలు వివరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్
  • పరిస్థితులకనుగుణంగా అస్త్రాలకు పదును
  • వార్​రూం వేదికగా కేసీఆర్​వ్యూహం
  • పక్షం రోజులుగా స్పెషల్​ఫోకస్!
  • ఎల్లుండి నుంచి రంగంలోకి సీఎం 
  • వ్యతిరేకతను తగ్గించుకునేలా ప్లాన్​ 
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి స్థానంలో రావులకు ఛాన్స్?
  • కాంగ్రెస్​లో రెబల్స్ అభ్యర్థులపైనా ఫోకస్


అసెంబ్లీ ఎన్నికలకు కీలక సమయం ఆసన్నమైంది. నెల రోజులుగా ప్రగతిభవన్​కే పరిమితమైన సీఎం కేసీఆర్..​ఆదివారం నుంచి కదనరంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పరిస్థితుల వివరాలు తీసుకున్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు, సర్వేల ఆధారంగా వివరాలు సేకరించిన కేసీఆర్.. ఇప్పుడు కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటిదాకా జిల్లాలను చుట్టుముట్టిన మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యి జిల్లాల పర్యటనలో మంత్రులు పరిశీలించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈనేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై కేసీఆర్​సుదీర్ఘంగా మాట్లాడినట్లు ప్రగతి భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : సుమారు నెల రోజుల నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మినిస్టర్లు కేటీఆర్, హరీశ్​రావు ప్రగతిభవన్​లో గురువారం సీఎం కేసీఆర్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారినుంచి వివరాలు సేకరించిన సీఎం.. సామాజిక అంశాల పరంగా అస్త్రాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో గురువారం జరిగిన చర్చలు కీలకంగా మారాయి. ఇదే సమయంలో ప్రగతి భవన్​లో కేసీఆర్​నేతృత్వంలో వార్​రూం ఏర్పాటైంది. ఈ వార్​ రూం వేదికగా కేసీఆర్​ వ్యూహాలను రచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీలోని రెబల్స్ నేతలపైనా స్పెషల్​ఫోకస్​పెట్టినట్లు తెలుస్తున్నది. పలు జిల్లాల కాంగ్రెస్​పార్టీ అధ్యక్షులతో కేసీఆర్​టీం మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఓట్లను చీల్చేందుకు వారిని అదే పార్టీ నుంచి రెబల్స్​గా పోటీ చేయించేందుకు బీఆర్ఎస్​అధినేత ప్లాన్​చేస్తున్నారంటూ ఇటు కాంగ్రెస్​లోనూ విమర్శలు వస్తున్నాయి. 

జిల్లాల్లో ఏం తేలిందంటే!

వైరల్ ఫీవర్​కారణంగా విశ్రాంతి తీసుకున్న కేసీఆర్​ఎన్నికల వ్యూహాలపై మాత్రం నిరంతరం పని చేస్తూనే ఉన్నారంటూ మంత్రులే ప్రకటించారు. ఈ సమయంలోనే పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​తో పాటుగా మంత్రి హరీశ్​రావును జిల్లాల్లో తిప్పారు. వీరిద్దరూ దాదాపుగా అన్ని జిల్లాల్లో పర్యటించారు. షెడ్యూల్​కు ముందే ప్రచార పర్యటనలు దాదాపుగా ముగిశాయి. ఈ పర్యటన సందర్భంగా మంత్రులు పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో సీఎంకు అందించారు. డబుల్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీలకు ఆర్థిక సాయంతోపాటుగా నిరుద్యోగ భృతిపై కొంత వ్యతిరేకత ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇదే విషయాన్ని సీఎంకు వివరించినట్లు తెలుస్తున్నది.

అస్త్రాలేంటి..?

విపక్షాలకు అందకుండా ఎన్నికల్లో పత్యర్థికి అంతుచిక్కని వ్యూహాలు రచించడం సీఎం కేసీఆర్ కు ఉన్న అదనపు బలం. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా ఆయనపైనే భారం వేశారు. ‘పులి బయటకు వస్తుంది’ అంటూ మంత్రి కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు పార్టీ పెద్దపులిగా భావిస్తున్న కేసీఆర్.. రెండు రోజుల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అస్త్రాలేమిటనే ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో తమ అమ్ముల పొదిలో ఇంకా చాలా పథకాలున్నాయని పలు మార్లు చెప్పిన కేసీఆర్.. ఈసారి ఎలాంటి అస్త్రాన్ని వదులుతారో తెలియదు కానీ ఇప్పటికే బయటకు తీసిన వాటిల్లో కొన్నింటికి మాత్రం పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. 

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై విమర్శలు..

ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ ఒకఎత్తయితే గత ఎన్నికల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన మరో ఎత్తు. ఈ ఉద్యోగాల కల్పన ప్రక్రియ అప్పుడో ఇప్పుడో వేస్తున్న నోటిఫికేషన్లతో కొనసాగుతున్నట్టే కనిపించినా నియమాకాలు జరగటం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక నిరుద్యోగ భృతి అంశం కూడా విమర్శలను పెంచుతున్నది. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ.3,016 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, అమల్లోకి రాలేదు. ఇదే విషయాన్ని అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రతీసారి సర్కారును దెప్పిపొడుస్తున్నాయి. దీంతో ఈసారి కచ్చితంగా నిరుద్యోగ భృతిని ప్రకటించేందుకు సిద్ధంగాఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఇలాంటి పథకాలు అమలవుతున్న ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారన్న దానిపై ఆరా తీశారు. ఇప్పటికే ఈ విషయాన్ని పట్టుకుని సర్కారుపై విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతిపై తమ స్టాండ్‌ ప్రకటించింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ రూ.4,016 భృతి ఇస్తామని నిరుద్యోగ డిక్లరేషన్ కూడా ఇచ్చింది. దీనితో పాటుగా సంక్షేమ పథకాల్లో నిధులన్నీ పెంచుతామని మంత్రులు కూడా ప్రకటించారు. లక్షన్నరకు కల్యాణలక్ష్మి, రైతుబంధు రూ.15 వేలు, ఆసరా 3 వేలు వంటి హామీలకు తుది రూపు తీసుకువచ్చారని సమాచారం. 

నిరసనల వెనక ఉన్నదెవరు?

మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం సందర్భంగా పలుచోట్ల నిరసనలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దళితబంధుపై వస్తున్న నిరసనలపై పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. అయితే, ఈ నిరసనల వెనక ఎవరు ఉన్నారు, వారిని తమ దారికి తీసుకురావడంపై ఆరా తీస్తున్నారు. పలు సెగ్మెంట్లలో ఇలాంటి అసంతృప్తులను దగ్గరకు తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా కాంగ్రెస్​ పార్టీ రెబల్స్​అభ్యర్థులను సైతం గుర్తిస్తున్నారు. చాలా జిల్లాలో కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షులకు టికెట్లు రావని తెలుస్తుండటంతో.. వారిని అవసరమైతే రెబల్స్​గా బరిలో నిలిచేలా బీఆర్ఎస్ బాస్​ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో కాంగ్రెస్ ఓటుబ్యాంకు చీలుతుందని అంచనా వేస్తున్నారు. అవసరమైతే వారికి ఆర్థికంగా సాయం చేసేందుకు సైతం బీఆర్ఎస్​ నేతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 

కసిరెడ్డి స్థానంలో రావుల?

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్​లో చేరడంతో.. అదే సామాజికవర్గంతో ఈ పోస్టును భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలోఉన్న రావుల చంద్రశేఖర్​రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్​లో చేరుతారని, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని తెలుస్తున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం చేజారకుండా ఉంటుందని ప్లాన్​వేస్తున్నారు.