కాంగ్రెస్ ​కు కుల గండం!

కాంగ్రెస్ ​కు కుల గండం!
  • కొలిక్కిరాని టికెట్ల అంశం
  • కత్తులు విచ్చుకుంటున్న పొత్తులు
  • ఏఐసీసీ తీరుపై టీ కాంగ్రెస్ సీనియర్ల గుర్రు
  • పార్టీపై తిరుగుబావుటాకు బీసీల నిర్ణయం?
  • నేడు గాంధీభవన్ ఎదుట నిరసన
  • ఫలితమివ్వని నష్ట నివారణ కమిటీ చర్యలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ జాప్యానికి అసలు కారణమేంటి? గెలుపు వ్యూహాంలో భాగమా? లేక అభ్యర్థుల ప్రకటన తర్వాత తలెత్తే పరిణామాలపై పొంచి ఉన్న భయమా? టిక్కెట్లు దక్కని నేతలను బుజ్జగించేందుకు నియమించిన నష్టనివారణ కమిటీ అసంతృప్త వాదానికి ఏ మేరకు చెక్ పెడుతుంది? గాంధీభవన్ నుంచి ఢిల్లీ వరకు బీసీ గళాన్ని వినిపించి.. 34 సీట్లు డిమాండ్​ చేసిన ఆ వర్గ సీనియర్​నేతలు కాంగ్రెస్​పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారా..? నేడు గాంధీభవన్​లో జరగనున్న బీసీ నిరసన.. రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుంది..? వీరి అసంతృప్తిని చల్లార్చేందుకు ఏఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది..? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపులో బీసీల పాత్ర ఏ మేరకు ఉండబోతోంది..? ఇప్పుడిదే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్​టాపిక్​ గా మారింది. ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో 45 రోజుల క్రితమే.. ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్​.. ఇంత  వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడం..కొత్తగా ఇతర పార్టీలతో పొత్తు నిర్ణయాలు హస్తం నేతల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.

టికెట్లు ఖరారు చేయాలని ఆశావహుల ఒత్తిడి..

వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కుల గండం పొంచి ఉంది. అత్యధిక ఓట్లు కలిగిన సామాజిక వర్గాలకు టిక్కెట్లలో ప్రాధాన్యం కల్పించాలంటూ ఆ వర్గ నేతల డిమాండ్​పై ఏఐసీసీ సానుకూల స్పందన ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఇప్పటికే బీసీలు 34 సీట్లు, ఎస్టీలు 15, కమ్మ సామాజికవర్గ నేతలు 12 సీట్లు డిమాండ్​ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల షెడ్యూల్​వెలువడినా అభ్యర్థులను ఖరారు చేయని అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీ కాంగ్రెస్​నేతలు అభ్యర్థులను ప్రకటించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇటు బీసీ, ఎస్టీ, కమ్మ, ముదిరాజ్​ తదితర సామాజికవర్గ నేతలను సంతృప్తి పర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఏఐసీసీ.. ఇటీవల వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపై ప్రకటన చేసి కాంగ్రెస్ ఆశావాహులను తీవ్ర నైరాశ్యానికి గురి చేసింది. అయితే వీటి మధ్య పొత్తు ఖరారు కాకముందే.. తాజాగా తెలంగాణ జన సమితి పార్టీతో పొత్తుపై మరో ఆలోచన చేస్తున్న అధిష్టానం ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరామ్​ను జనగామ నుంచి బరిలో దింపాలని భావిస్తోన్న ఏఐసీసీ తీరుపై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయా పార్టీల మధ్య సీట్ల చర్చల నేప‌థ్యంలో తాము పోటీ చేసే స్థానాలకు ఎక్కడ ఎసరు వస్తుందోనని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరుకోవడం.. తాము కోరిన సీట్ల కేటాయింపుపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన చెందుతోన్న బీసీ నేతలు నేడు గాంధీభవన్ లో నిరసన కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యారు. బీసీ నిరసనతోపాటే టిక్కెట్లు ఆశిస్తున్న ఇతర వర్గ నేతలూ టిక్కెట్ల కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో హస్తంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే చర్చ ఆసక్తి రేపుతోంది. పొత్తుల విషయంలో కాంగ్రెస్​ వైఖరి ఆ పార్టిని భంగపాటుకు గురి చేస్తుందని టీపీసీసీ సీనియర్లే చెప్పడం గమనార్హం. 

పొత్తు ఖాయం.. ఉల్లంఘన తథ్యం!

ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్​కు సొంత పార్టీ నేతలతోనే సమస్య వచ్చిపడింది. కమ్యూనిస్టులతో పొత్తును దాదాపు ఖరారు చేసిన హస్తం వారికి భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడ, మునుగోడు, టీజేఎస్​ అధినేత ప్రొఫెసర్​ కోదండరామ్​కు జనగామ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అంశం ఆయా స్థానాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న సీనియర్లను హైరానా పెట్టింది. పొత్తులు కుదిరితే భంగపాటు తప్పదనే భావనతో ఉన్న కాంగ్రెస్​నేతల్లో అప్పుడే అసంతృప్తి పెల్లుబుకుతోంది. మరోవైపు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తలెత్తే అసంతృప్తిని ముందే పసిగట్టిన ఏఐసీసీ కాంగ్రెస్​ సీనియర్​నేత జానారెడ్డి నేతృత్వంలో ఓ కమిటీ వేసి.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే రంగంలో దిగిన ఆ కమిటీ సభ్యులు టిక్కెట్లు వరించని అసంతృప్తుల వివరాలను నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాల్లో ఒకవేళ టిక్కెట్టు రాకపోతే వారిని నామినేటెడ్, పార్టీ పదవులు కట్టబెడతామనే హామీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి కాంగ్రెస్ అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​అధికారంలో లేకున్నా ఏళ్ల నుంచి పార్టీలోనే కొనసాగుతోన్న తమకు అధిష్టానం గుర్తించకపోతే  రెబెల్​ గా లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని కొందరు భావిస్తుంటే.. ఇంకొందరు పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతన్నట్లు ప్రచారం జరుగుతోంది.