సారీ మేడం.. గవర్నర్​కు ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి క్షమాపణ

సారీ మేడం.. గవర్నర్​కు ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి క్షమాపణ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి.. జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. గవర్నర్ తమిళిసైకి కూడా లేఖ ద్వారా క్షమాపణ చెబుతానని కమిషన్​ ముందు ఒప్పుకున్నారు. గవర్నర్‌ తమిళిసై పై అవమానకరమైన రీతిలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ వాఖ్యలను సుమోటోగా స్వీకరించి ఆయనకు కమిషన్ నోటీసులిచ్చింది. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దానిలో భాగంగా మంగళవారం విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కమిషన్ నోటీసులందుకున్న ఆయన మంగళవారం ఢిల్లీలో మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణకు సందర్భంగా ఎలాంటి డిమాండ్​ లేకుండా కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌పై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని, అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై విచారణ సందర్భంగా క్షమాపణ చెప్పిన కౌశిక్​ రెడ్డి.. తాను స్వయంగా లేఖ ద్వారా కూడా క్షమాపణ కోరుతానని కమిషన్​ ముందు చెప్పాడు.