17 నెలల్లో  డీఏ సర్దుబాటు

17 నెలల్లో  డీఏ సర్దుబాటు
  • ఏరియర్స్ పై ప్రభుత్వం నిర్ణయం
  • ఒకే విడుతలో సర్దుబాటు కష్టమన్న సర్కారు
  • వచ్చేనెల వేతనం నుంచి స్టార్ట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన సర్కారు.. ఏరియర్స్ విడుదల చేయడంలో మాత్రం మళ్లీ పాత కథే తెరపైకి తీసుకువచ్చింది. ఇటీవల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లుగా ప్రకటించింది. 2.73 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేశారు. ముందుగా జూన్ నెల వేతనంతో పెంచిన డీఏ చెల్లింపు చేస్తామని ముందుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జనవరి నెల నుంచి పెరిగిన ఈ అలవెన్సులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు భారం పడుతుందని, ఏడాదికి రూ.974.16 కోట్ల బరువు పడనుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఉద్యోగులతోపాటుగా రిటైర్డ్​ఉద్యోగులకు కూడా వర్తింప చేయనున్నారు. వీరితోపాటుగా జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వ్యవసాయ మార్కెట్​కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్​, పాలిటెక్నిక్, విశ్వ విద్యాలయాల్లోని టీచింగ్, నాన్​టీచింగ్​స్టాప్​కు వర్తింపజేశారు. 

ఏరియర్స్​ కోసం..!

డీఏ ఏరియర్స్​గతేడాది జనవరి నుంచి రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పుడు జీఓ ఇచ్చింది. వీటిటన్నింటినీ ఒకేసారి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఒకేసారి దాదాపు రూ.1,38‌‌0 కోట్ల మేరకు ఏరియర్స్​ఉంటాయి. వీటిని ఒకే విడుతలో సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. గతంలో పీఆర్సీ ఏరియర్స్ లోనూ ఇదే తరహాలో దాదాపు రెండేండ్ల పాటు ఇచ్చారు. కొన్ని నెలల్లో వేతనాలకు డబ్బులు లేక ఆపారు. ఇలా ఏడాదిలో ఏరియర్స్​ఇస్తామని రెండేండ్లు సాగదీశారు. ఇప్పుడు డీఏ ఏరియర్స్​ కూడా 17 నెలల పాటు వేతనాల్లో కలిపి ఇస్తామంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నుంచి ఇచ్చే వేతనాల్లో కలిపి వేస్తామని ప్రకటించారు.