ఏపీ నీటి దోపిడి చేస్తోంది

ఏపీ నీటి దోపిడి చేస్తోంది
  • అనుమతి కంటే ఎక్కువ తరలిస్తున్నారు
  • తుంగభద్ర బోర్డుకు తెలంగాణ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాలను కేసీ కెనాల్​ కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్​ వేసిందని, ఈ నీటి తరలింపును వెంటనే నిలిపివేయాలని తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ఒకటి, రెండు అవార్డుల ద్వారా అనుమతించిన దానికంటే ఎక్కువ నీటిని తరలించేందుకు యత్నిస్తుందని, ట్రిబ్యునల్‌ ఒకటో అవార్డు కేసీ కెనాల్‌, తుంగభద్ర రైట్‌ బ్యాంక్‌ హైలెవెల్‌ కెనాల్‌, రైట్ బ్యాంక్‌లో లెవెల్‌ కెనాల్‌ తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రమే తుంగభద్ర నీటిని ఉపయోగించాలని నిర్దేశించిందని, కానీ, ఏపీ మాత్రం కృష్ణా నీటిని కేసీ కెనాల్‌కు వినియోగిస్తుందని ఆరోపించారు. తుంగభద్ర రైట్‌బ్యాంక్‌ హైలెవెల్‌ కెనాల్‌ దాని కేటాయింపులో 81.5శాతం పెన్నా బేసిన్‌లోని కృష్ణా బెసిన్‌ వెలుపల ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1, 2 అవార్డులు బెయిన్‌ ఆవలికి నీటిని తరలించేందుకు అనుమతించలేదని, దీనికి విరుద్ధంగా టీబీ ఆర్బీ కానీ, టీబీ ఆర్బీ హెచ్‌ఎల్‌సీ ద్వారా ఎక్కువ నీటిని బెసిన్‌ ఆవలికి ఏపీ మళ్లిస్తోందని మండిపడ్డారు. సుంకేశుల ద్వారానే తుంగభద్ర జలాలను వినియోగించాలని, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు తుంగభద్ర జలాలు వాడాలన్నారు. కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయించాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శిని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​కోరారు.