‘ఓటుకు నోటు’లో దొంగ రేవంత్ 

‘ఓటుకు నోటు’లో దొంగ రేవంత్ 
  • అలాంటి వ్యక్తి టీ కాంగ్రెస్ ని నడుపుతుండు!
  • సీటుకో రేటు పెట్టి అమ్ముకుంటుండు
  • కోమటిరెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి
  • మాది గాంధీ వారసత్వం.. మోడీది గాడ్సే వారసత్వం
  • మంత్రి జగదీశ్​రెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించాలి
  • నల్గొండ, సూర్యాపేట సభల్లో మినిస్టర్​కేటీఆర్​

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : ఓటుకు నోటు కేసులోలో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్​రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు. సోమవారం సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్ తోపాటు రూ.530 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే నల్గొండలో నల్గొండ మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్, సెంట్రల్ లైటింగ్ పనులు, ఐటీ టవర్, కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహం, ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, ఎన్జీ కళాశాల స్ట్రీట్ వెండర్స్ తదితర పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడారు. 

జగదీశ్​రెడ్డిది రాజీలేని కృషి..

అభివృద్ధి విషయంలో మంత్రి జగదీశ్​రెడ్డి రాజీలేని కృషి చేస్తున్నారని, ఆయన శ్రమతో నల్గొండ మెట్రో నగరాన్ని తలపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి చేసిన సేవకు ప్రతిఫలంగా 50 వేల ఓట్ల మెజారిటీతో ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్న మంత్రి, పుల్లారెడ్డి చెరువు ఆధునికరణ, జమ్మిగడ్డ వరకు రహదారుల విస్తరణ కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

రేవంత్​కు ఓటేద్దామా..?

ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్​రెడ్డికి ఓటు వేద్దామా? అని ప్రజ‌ల‌ను ప్రశ్నించారు. ప్రజ‌లు కాంగ్రెస్ కు 11 సార్లు అవ‌కాశం ఇచ్చినా రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదన్నారు. గతంలో వారి పరిపాల‌నలో కాలిపోయే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎరువుల కొరత, విత్తనాల‌ను పోలీసు స్టేష‌న్‌లో ఉంచి పంచిపెట్టిన దుస్థితి ఉండేదని ప్రజలకు గుర్తు చేశారు. అలాంటి వారికి ఓటేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని అన్నారు. ఒక్కోసీటుకు ఒక్కో రేటు పెట్టి అమ్ముకుంటున్న రేవంత్​రెడ్డి.. రేపు అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటాడని ఆరోపించారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో 75 ఏండ్లలో ఎవ‌రూ చేయ‌ని ప‌నులు చేసుకున్నాం, చేసుకుంటున్నాం అన్నారు. ఏ ప్రధాని, ఏ సీఎం ఆలోచ‌న చేయ‌ని విధంగా రైతుబంధు కింద డ‌బ్బులు జ‌మ చేస్తున్నాం అన్నారు. ఇప్పటివరకు  రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జ‌మ చేశామన్న కేటీఆర్.. ఇటువంటి పథకం దేశంలో మరి ఎక్కడా లేదన్నారు. 

నల్గొండలో రూ.1,350 కోట్లతో అభివృద్ధి పనులు

గడిచిన నాలుగు సంవత్సరాల్లో నల్గొండలో రూ.1,350 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి కేటీఆర్​అన్నారు. అమరుల ఆశయాల వారసత్వ పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉందని త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. నల్గొండను దత్తత తీసుకుంటామంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హేళన చేశారని, ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ పనితీరు చూసి ఆయన నెత్తి ఖారాబైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు వస్తదని, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి లెక్కన ఐదేళ్లకు ఐదుగురు సీఎంలు మారుతారని అన్నారు. అలాగే ఆకాశం నుంచి పాతాళం దాకా కుంభకోణాలు జరుగుతాయన్నారు.