కేంద్రానికి బుద్ధి చెబుతాం

కేంద్రానికి బుద్ధి చెబుతాం
  • ‘ముందస్తు’కు మేమూ సిద్ధమే
  • పార్లమెంటు సెసన్స్​లో నిలదీస్తాం
  • ప్రజా వ్యతిరేక బిల్లులను అడ్డకుంటాం
  • ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి పేరు
  • దేశ ప్రజల శ్రేయస్సు కోసమే మా ప్రయత్నాలు
  • మోడీ సర్కారు ఒక్కరి కోసమే పని చేస్తోంది
  • దేశంలో ధరలు, అవినీతి విపరీతంగా పెరిగాయి
  • ఇండియా కూటమి భేటీలో విపక్ష నేతలు


(ముద్ర, నేషనల్ డెస్క్):-తమ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరిగి కూటమికి భారీ మెజార్టీ లభించాలని, ఆ తరువాత పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం సెప్టెంబరు రెండో వారంలో నిర్వహించనున్న పార్లమెంటు సమావేశాలలో కేంద్రానికి గట్టిగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా కూటమి సిద్ధంగా ఉందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజా వ్యతిరేక బిల్లులను తిప్పికొడతామన్నారు. దేశ క్షేమం కోసం బీజేపీ విధానాలను ఎండగడదామని ఇండియా కూటమి నేతలకు పిలుపునిచ్చారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు .‘ఇండియా’ కూటమి బుధవారం ముంబైలో భేటీ అయ్యింది. విపక్షాల ఐక్యత, సీట్ల సర్దుబాటు, కీలక నేతలకు పదవుల పందెరం, కూటమి లోగో ఆవిష్కరణ తదితర అంశాలపై చర్చించింది.  బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ పీఎం అభ్యర్థిగా అనేక పేర్లు ముందుకు వస్తున్నాయని, ప్రస్తుతం పీఎం ఇండియా కూటమి ఉంటుందని మాత్రమే తాను చెప్పగలనన్నారు. ప్రస్తుతం పీఎం ఎవరన్న విషయాన్ని ప్రకటించే అవసరం ఇండియా కూటమికి లేదన్నది తన అభిప్రాయమని జమ్మూకశ్మీర్​మాజీ సీఎం ఉమర్​ అబ్దుల్లా అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసమే ఈ సభ నిర్వహిస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్ అన్నారు. యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. ధరలు పెరగుతూనే ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఒక్కరికోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ఎవరి కోసం పనిచేస్తుందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడుతూ ఇండియా కూటమిలో తాము కూడా ఉన్నామన్నారు. తాము కూటమిలో ఉండడంతో కొందరికి బాధ కలుగుతోందని ఆరోపించారు. ఇండియా కూటమి పనితీరు సరైన దిశలో వెళుతున్నందునే అధికార పక్షానికి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. తాను దేశ యువతకు కూటమి నేతగా ఒక్కటే చెబుతానన్నారు. గాంధీ చూపిన శాంతి మార్గంలో నడవాలన్నారు.

వ్యూహాల మీద ప్రత్యేక చర్చ

మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, బిహార్, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరేతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. హయత్ గ్రాండ్ హోటల్‌లో ఈ సమావేశం కొనసాగింది.  పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే అంశాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం దాని మిత్రపక్షాలపై వ్యవహరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దేశంలోని నిరుద్యోగం, ధరల పెంపు, అభివృద్ధి, మత కలహాలు, జీఎస్టీ, బడా పారిశ్రామిక వేత్తలకు ఆపన్నహస్తం అదే సమయంలో ఎంఎస్​ఎంఈ సంస్థలకు మొండిచేయి లాంటి వాటిని సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 

విపక్షాలది స్వార్థపూరిత కూటమి

విపక్షాలది స్వార్థపూరిత కూటమి అని, ఇలాంటి కూటములను ఎదుర్కొనడం తమకు కొత్తేమీ కాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా అన్నారు. 2014–2019లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినా వాటిని తిప్పికొట్టామని, ప్రజలు మళ్లీ మోడీ సర్కార్​కే పట్టం కట్టారని గుర్తుచేశారు. ముచ్చటగా మూడోసారి కూడా ఇదే జరగనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి కూటమి తమ బలం, ఐక్యతను చూపుతున్నా, తీరా ఎన్నికలు దగ్గరికొచ్చే సరికి వారిలో వారే పదవుల పందేరంపై కీచులాడుకొని విడిపోవడం ఖాయమన్నారు. విపక్ష పార్టీల్లో అవినీతి కేసులు, ఆరోపణలు, కుంభకోణాల పార్టీలే ఉన్నాయన్నారు. దేశ భద్రతకు, సమగ్రతతకు ఏ మాత్రం విలువనీయని కూటమి ఇదని సంబిత్​ విమర్శించారు.